పొలం పిలుస్తోంది విత్తనం పొమ్మంటోంది | Sakshi
Sakshi News home page

పొలం పిలుస్తోంది విత్తనం పొమ్మంటోంది

Published Tue, Sep 23 2014 3:22 AM

no seeds for  farmers

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  జిల్లాలో విత్తన కష్టాలు అన్నదాతను వెంటాడుతున్నాయి.  సకాలంలో విత్తనాలు అందించాల్సిన అధికారులే తీవ్ర జాప్యానికి కారణం అవుతున్నారు. విత్తనాల అందించే విషయంలో  అధికారుల ప్రణాళిక లోపం రైతులకు శాపంగా మారింది. బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 జిల్లా అవసరాలకు సరిపడా విత్తనాలు సరఫరా కాకపోవడం ఒక ఎత్తై, ఉన్న విత్తనాలను ఏపీసీడ్స్ సక్రమంగా మంజూరు చేయకపోవడం మరో ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల్లో అసహనం పెరుగుతోంది. అరకొరగా ఉన్న విత్తనాలను కూడా ఆయా మండలాల్లో సరఫరా చేయకపోవడంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కురిచేడు ఇంకా చుట్టు పక్కల మండలాల నుంచి వందలాది మంది రైతులు విత్తనాలకోసం పడరాని పాట్లు పడుతున్నారు.

 ప్రతిరోజూ నిద్రలేచి విత్తనాల కోసం  జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న రైతులూ ఉన్నారు. తీరా వచ్చినా తోపులాటలు ... ఇక్కట్లే తప్ప ఫలితం దక్కడం లేదు. ఇంత జరుగుతున్నా రైతన్నల కష్టాలు తీర్చాల్సిన అధికార పార్టీ నేతలు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.
 
 అవసరమైనన్ని ఏవీ
 జిల్లాకు రబీలో వరి వేసుకునేందుకు సుమారుగా 60 వేల క్వింటాళ్ల వరకు అవసరమవుతాయని అంచనా. కానీ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం కేవలం మూడు వేల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం వరి యన్‌ఎల్‌ఆర్ -145 రకం విత్తనం 2,200 క్వింటాళ్లున్నాయి. వీటిలో గత వారం రోజులుగా 1200 క్వింటాళ్లు పంపిణీ చేశారు.  

  జిల్లాలో శనగలు 93,660 హెక్టార్లలో వేస్తారు. దీని కోసం 63,672  కింట్లాళ్ల విత్తనాలు అవసరం కాగా కేవంల 927 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  మినుము 5146 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 390 క్వింటాళ్లు మాత్రమే అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి.  వేరుశనగ, సన్‌ఫ్లవర్, మొక్కజొన్న, సజ్జ అసలు అందుబాటులో లేవు.

 నియోజకవర్గానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయాలి : రైతు నేత దుగ్గినేని గోపీనాథ్
 రైతులకు సరిపడా విత్తన సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 60 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. కానీ కేవలం మూడు వేలు క్వింటాళ్లు  సరిపోతాయని అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టడంలోనే శ్రద్ధ ఎంతుందో అర్థమవుతోంది.  రైతుల సౌకర్యార్థం ప్రతి నియోజకవర్గంలో విత్తన సరఫరా కేంద్రం ఏర్పాటు చేసి తగినన్ని విత్తనాలు సరఫరా చేయాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement