ధర మోత.. సబ్సిడీ కోత | Sakshi
Sakshi News home page

ధర మోత.. సబ్సిడీ కోత

Published Tue, May 23 2017 5:03 PM

ధర మోత.. సబ్సిడీ కోత

► అధిక ధరలకు వేరుశనగ విత్తన కాయల పంపిణీ
► కరువు ప్రాంత సబ్సిడీలోనూ కోత
► విత్తనాలతోపాటు జిప్సం, నవధాన్యాలు కొనుగోలు తప్పనిసరంటున్న అధికారులు
►సాగు ప్రారంభంలోనే తడిసి మోపెడవుతున్న ఖర్చులు


ఏడాదిగా వర్షాభావం వల్ల కరువు విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వం చిత్తూ రును కరువు జిల్లాగా ప్రకటించింది. అయితే ఉపశమనానికి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం మరిచిపోయింది. ఫలితంగా జిల్లా ప్రజలు, రైతాంగం ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఖరీఫ్‌ సీజనులో వేరుశనగ సాగుకు చేయూత అందించాల్సిన ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోంది. తాజాగా వేరుశనగ విత్తన కాయలకు అందించాల్సిన సబ్సిడీలోనూ కోత విధిస్తోంది.

చిత్తూరు (అగ్రికల్చర్‌): ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు జిల్లా రైతాంగానికి శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేయాలనుకునేవారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. రైతులు సబ్సిడీ విత్తన కాయలతో పాటు జిప్సం, విత్తనశుద్ధి మందులు, చిరుధాన్యాల విత్తన గింజలు కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ అధికారులు ఆంక్షలు విధించడమే ఇందుకు నిదర్శనం. దీంతో రైతులకు సాగు ప్రారంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టా ల్సిన దుస్థితి ఏర్పడింది.

84వేల క్వింటాళ్ల విత్తనకాయల కేటాయింపు..
జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజనుకు వేరుశనగ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తన కాయలు 84,500 క్వింటాళ్లు కేటాయించింది. మొత్తం 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశనగను సాగు చేస్తారు. వర్షాధారితంగా సాగయ్యే ఈపంట ద్వారా రైతులకు ఆశించిన మేరకు కచ్చితమైన దిగుబడి వస్తుందనే నమ్మకం లేదు. రైతులు  నష్టాలను చవిచూడాల్సి వచ్చినా నిరుత్సాహం చెందకుండా పంట సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఏటా విత్తనకాయలను సబ్సిడీపై అందించడం పరిపాటి. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. సబ్సిడీ పేరుతో అధిక ధరలను నిర్ణయిస్తూ రైతులను మరింత అప్పుల్లోకి నెడుతోంది.

సబ్సిడీలోనూ కోతే..
చిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించినా విత్తన కాయలకు  సబ్సిడీపై ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ఏటా వేరుశనగ విత్తనకాయలను రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 35 శాతం మేరకు సబ్సిడీతో రైతులకు అం దించడం పరిపాటి. గత ఏడాది కూడా 33.3 శాతంతో కిలోవిత్తన కాయలను రూ. 50 చొప్పున అందించింది. ఈ ఖరీఫ్‌కు గత ఏడాదికన్నా 6.67 శాతం పెంచి, 40 శాతం సబ్సిడీతో కాయలు అందించే విధంగా నిర్ణయం తీసుకోనుంది. కరువు జిల్లాలో మాత్రం కనీసం 50 శాతం సబ్సిడీతో విత్తన కాయలు అందించి రైతులను ఆదుకోవాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టని ప్రభుత్వం మన జిల్లా రైతులకు కూడా అన్ని జిల్లాలతో సమానంగానే చూస్తూ సబ్సిడీలో 10 శాతం మేరకు కోత విధించింది. కేటాయించిన 40 శాతం సబ్సిడీతో కిలో విత్తన కాయలు రూ.46.20 చొప్పున బస్తా కాయలు (30 కిలోలు) రూ.1,386 మేరకు అందించనుంది. గత ఏడాదికి పోలిస్తే బస్తాపై కేవలం రూ.114 మాత్రమే తగ్గించి అన్ని జిల్లాలతోపాటు మనకు కేటాయించింది. ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించినా.. ఒరిగిందేమీ లేదని రైతులు వాపోతున్నారు.

జిప్సం, నవధాన్యాలు తప్పనిసరి..
వేరుశనగ విత్తన కాయలతోపాటు రైతులు జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలు కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని వ్యవశాయశాఖ అధికారులు నిబంధనలు పెడుతున్నారు. విత్తనకాయలతోపాటు ప్రతి రైతు తప్పనిసరిగా రెండు క్వింటాళ్ల మేరకు జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలు కంది, జొన్న, అలసంద, పెసర, అనప తదితర విత్తన గింజలు కొనుగోలు చేయాలనే ఆంక్షలు పెడుతున్నారు.

భారం ఇలా..
వేరుశనగ సాగు చేయాలంటే రైతులు ఆరంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరా సాగు చేయాలంటే రెండు బస్తాల విత్తనకాయలకు రూ.2,772లతో పాటు  రెండు క్విటాళ్ల జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలకు దాదాపు రూ.500 మేరకు వెచ్చించాల్సి ఉంది. ఇదిగాక దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఆ మేరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టేందుకు రైతులు సిద్ధమైనా గత ఏడాదిలాగే మళ్లీ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం నెలకొంటే ఈసారి కూడా ఆశించిన మేరకు పంట చేతికొస్తుందనే నమ్మకం లేదు. దీంతో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు.

29 నుంచి వేరుశనగ విత్తన కాయల పంపిణీ
చిత్తూరు అగ్రికల్చర్‌: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు ఈనెల 29 వ తేదీ నుంచి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ హరిజవహర్‌ ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా వ్యవసాయాధికారులతో సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 84,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేసేందుకు 238 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు కాయల పంపిణీని బయోమెట్రిక్‌ విధానం ద్వారా చేపట్టాలన్నారు. ఇందుకోసం బయోమెట్రిక్‌ విధానంపై వ్యవసాయశాఖ సిబ్బంది ఈనెల 26న ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్నారు. 29న కాయల పంపిణీ చేపట్టాలన్నారు. రైతులకు అందించే సబ్సిడీ విత్తన కాయలకు ప్రభుత్వం 40 శాతం రాయితీ ప్రకటించిందన్నారు. ఈ సబ్సిడీ మేరకు కే6 రకం విత్తన కాయలను రూ.77గా నిర్ణయించగా, సబ్సిడీ రూ.30.80 పోగా రైతు కిలో రూ.46.20కు, నారాయణి రకం కాయలకు కిలో రూ.79 నిర్ణయించగా అందులో సబ్సిడీ రూ.31.10 పోగా రైతుకు కిలో రూ.47.90 చొప్పున అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ  ప్రకారం కే6 రకం బస్తా (30 కిలోలు) రూ.1,386,  నారాయణి రకం బస్తా (30 కిలోలు) రూ.1,437 ధరతో రైతులకు అందించనున్నారు.

Advertisement
Advertisement