మున్సిపోల్స్‌కు అడ్డెవరు? | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు అడ్డెవరు?

Published Wed, Feb 12 2014 2:09 AM

No threat to Municipal elections

మా ఆదేశాలు పాటించవద్దన్నది ఎవరో వెల్లడించండి
ప్రభుత్వ సీఎస్‌కు హైకోర్టు ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: నాలుగు వారాల్లోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని గత వారం హైకోర్టు ఆదేశించినా స్పందించని అధికారం... హైకోర్టు ఘాటు వ్యాఖ్యల సారాంశంతో అడ్వొకేట్ జనరల్ పంపిన లేఖ సోమవారం అందడంతో ఉరుకులు పరుగులు పెట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక మంత్రి సంతకాల ప్రక్రియ పూర్తి చేసి ఆ సాయంత్రానికే ముఖ్యమంత్రి ముందుకు ఫైల్‌ను పంపినట్లు తెలిసింది. సీఎం ఆమోదం లభిస్తే మార్చిలోనే మున్సిపోల్స్ జరగవచ్చని అధికార వర్గాల అంచనా.
 
 ఏజీ లేఖ ప్రకారం... ‘‘మున్సిపల్ ఎన్నికలకు ఎవరు అడ్డుపడుతున్నారు? కోర్టు ఆదేశాలు పాటించవద్దంటూ అడ్డుకుంటోందెవరు? వారి పేర్లను వెల్లడించండి’’అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతిని హైకోర్టు గత వారం ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించకపోవడమంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోవడమే అవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్‌ను హెచ్చరించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ మీరు (సీఎస్) దాఖలు చేసిన అఫిడవిట్ మాకు ఆశ్చర్యం కలిగించింద’’ని వ్యాఖ్యానించింది. ‘‘రాష్ట్ర విభజన జరుగుతుందా? లేదా? జరిగితే ఎప్పుడనే విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. రాష్ట్ర విభజన జరగనంత వరకు ఎన్నికలు నిర్వహించడంలో ఇబ్బందేమిట’’ని ప్రశ్నించింది.
 
 నాలుగు వారాల్లో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గత వారం ఆదేశించినప్పటికీ... కోర్టు ఉత్తర్వుల ప్రతి అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. దీంతో హైకోర్టు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల సారాంశం (ఆపరేటివ్ పోర్షన్)ను లేఖ రూపంలో అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వానికి పంపారు. ఈ లేఖ సోమవారం ప్రభుత్వానికి అందింది. దీంతో ఆగమేఘాలపై అధికార యంత్రాంగం ఎన్నికల ఫైల్‌పై పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, సీఎస్ మహంతి సంతకాలు చేయించింది. ఈ ఫైల్‌ను అదేరోజు సాయంత్రానికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో అప్పగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించానికే ఈ ఫైల్‌ను ఇలా పంపించినట్లు వినికిడి. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణకు సీఎం అనుమతి ఇస్తే వెంటనే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేసి దానిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన నాలుగైదు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఓ అధికారి వివరించారు.
 
  146 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ.. రాష్ట్రంలో ఆ ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉన్నందున, మార్చిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సాధారణ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement
Advertisement