ప్రయోజనం లేని బడ్జెట్... | Sakshi
Sakshi News home page

ప్రయోజనం లేని బడ్జెట్...

Published Tue, Feb 11 2014 2:59 AM

no use of otan account budget

 రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమి లేదని వివిధ రాజకీయ పార్టీల నేతలు పేర్కొన్నారు. సంక్షేమాన్ని విస్మరించి అంకెలగారడీతో ఢంకా భజాయించుకున్నారని ఎద్దేవా చేశారు.  ఇదీ ముమ్మాటికీ ఎన్నికల బడ్జెటేనని అన్నారు.

నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే..  
  రైతు సంక్షేమాన్ని విస్మరించారు
 రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ద్వారా తన నిజస్వరూపాన్ని ప్రదర్శించింది. రైతుల సంక్షేమాన్ని విస్మరించింది. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఈ బడ్జెట్ ఉంది. ప్రాజెక్టుల నిర్మాణానికి అరకొరగా నిధులు కేటాయించారు. సంక్షేమ పథకాలకు మొండి చెయ్యిచూపారు. దిశ, నిర్దేశం లేని బడ్జెట్ ఇది. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఇది కేవలం ఎన్నిక బడ్జెట్‌గానే ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,
 వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త

 ఇది ధనవంతుల బడ్జెట్
 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ధనవంతుల బడ్జెట్ మాదిరిగా ఉంది. జలయజ్ఙం పేరిట ప్రాజెక్ట్‌లను నిర్మించడం కాంట్రాక్ట్‌దారులను బాగు చేయడం కోసమే. ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాల ఊసే లేదు. ఇప్పటి వరకు ప్రజాసమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికోసం ఈ బడ్జెట్‌ను రూపొందించునట్టు ఉంది. -పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రజలకు ప్రయోజనం లేదు

 ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా మారుమూలన ఉన్న ప్రజలకు ఈ బడ్జెట్ ఫలం అందడంలేదు. ప్రధాన రం గాలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా నిధుల కేటాయింపు మాత్రం చేయడంలేదు.  -దిండిగాల రాజేందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు

 ఎన్నికల బడ్జెట్
 ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు  బడ్జెట్ పెట్టినట్లు ఉంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించారు.  గతేడాది ప్రకటించిన నిధులే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆర్థిక మంత్రి మసిపూసి మారేడు కాయ చేశారు. -కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు
 
 ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
 ప్రజా సంక్షేమాన్ని విస్మరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది.  బడ్జెట్‌లో సంక్షేమ పథకాల ఊసే లేదు. ఈ ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వల్ల పేదలకు ఒరిగిందేమి లేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి చేతులు దులుపుకున్నారు. - భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి

 బ్రహ్మాండమైన బడ్జెట్
 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ప్రజాసంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మరోసారి రుజువు చేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీ, ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు. మహిళలకు, రైతుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించడం శుభ సూచికం.
 -వనమా వెంకటేశ్వర్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

 
 ప్రజా వ్యతిరేక బడ్జెట్
 ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్.  కొత్తసీసాలో పాతసార అన్నట్లుగా ఉంది. సంక్షేమపథకాలనుమరిచారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు, సీట్ల కోసమే హడావిడి గా రూపొందించారు. గొప్పులు చెప్పుకోవడానికే కాం గ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది.  ప్రజామోద యోగ్యంగా లేదు.
 -పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు

 ఇది అంకెల గారడీ
 ప్రభుత్వం అట్టహాసంగా రూ.1.83 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అంకెలగారడీ చేసింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వ చర్యలతో నానాటికీ ప్రజలపై అప్పులభారం పడుతోంది. గత ఏడాది ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు సంబంధించిన బడ్జెట్‌నే ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కి నిధులే లేవు.                  - కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

 పసలేని బడ్జెట్
 ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్టిన బడ్జెట్.  ఇందులో పసలేదు. లక్ష్యం కన్పించడంలేదు. తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. సాగునీటి రంగానికి కంటితుడుపుగా నిధులిచ్చారు. వీటితో ప్రాజెక్టు కట్టే కూలీలకు ఇచ్చే డబ్బులకు కూడా సరిపోవు, సంక్షేమ పథకాలను కుదింపు చేశారు.
 -ప్రొఫెసర్ కనకాచారి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్

 సామాన్యులకు ఒరిగిందేమిటి..?
 రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగింది ఏమిలేదు. బడ్జెట్ అంతా తప్పుల తడకగా ఉంది. నిరుద్యోగులకు రాజీవ్‌యువకిరణాలు పథకం ద్వారా వేల ఉద్యోగాలు కల్పించామని ఆర్థిక మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది.  కేవలం ఇది ధనవంతుల బడ్జెట్ మాత్రమే.
 - పోతినేని సుదర్శన్ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి

Advertisement

తప్పక చదవండి

Advertisement