సమైక్య తీర్మానం వల్ల ఫలితం ఉండదు | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానం వల్ల ఫలితం ఉండదు

Published Sat, Oct 19 2013 1:45 AM

సమైక్య తీర్మానం వల్ల ఫలితం ఉండదు - Sakshi

 ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులతో సీఎం  
 టి.తీర్మానం వచ్చినప్పుడు ఓడించడానికి కృషి చేస్తామని హామీ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వీలుగా వెంటనే శాసనసభను సమావేశపరచి సమైక్య తీర్మానం చేయించడానికి చర్యలు తీసుకోవాలంటూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక’ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. వేదిక నేతలు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, వి.లక్ష్మణరెడ్డి, జ్యోతితో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ‘‘రాష్ట్ర విభజన చేయాలని ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసినా ఎలాంటి ఫలితం రాలేదని, కేంద్రం పట్టించుకోలేదని సీఎం గుర్తు చేశారు. మన శాసనసభలో సమైక్య తీర్మానం చేయడంవల్ల కూడా ప్రయోజనం ఉండదని చెప్పారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడించడానికి కృషి చేస్తామని, అందువల్ల ప్రయోజనం ఉంటుందన్నారు’’ అని భేటీ అనంతరం జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. సమైక్యవాదులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి  మంజూరు చేయమని పోలీసులను ఆదేశించాలని తాము విజ్ఞప్తి చేయగా, పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పామని, దీనికి సీఎం స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అఫిడవిట్లు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రిగా మీరూ సంతకం చేయమని కోరగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement