ఇదేం బుద్ధి సారూ? | Sakshi
Sakshi News home page

ఇదేం బుద్ధి సారూ?

Published Wed, May 3 2017 11:07 AM

ఇదేం బుద్ధి సారూ?

► బూచేపల్లి ట్యాంక్‌లకు నీరివ్వరా?
► గొంతెండుతుంటే మంత్రి ఆదేశాలంటారా?
► కాంట్రాక్టర్లు, అధికారుల తీరును తప్పుపట్టిన స్థానికులు


దర్శి: అధికారం చేతిలో ఉంది కదా అని నీచబుద్ధిని ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. తాగునీటిని అందించడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ట్యాంకులకు ఎన్‌ఏపీ నీరు ఇవ్వకుండా నీచబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అడిగితే మంత్రి ఆదేశాలు అంటూ గ్రామస్తులకు నీరివ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. మండలంలోని సాయినగర్, శివరాజ్‌నగర్‌ గ్రామాల్లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులకు దర్శి ఎన్‌ఎస్పీ కార్యాలయంలో నీరు ఇవ్వమని అధికారులు, కాంట్రాక్టర్‌లు తెగేసి చెప్పారు.

పేదలకు ఉచితంగా సరఫరా చేస్తుంటే నీరెందుకు ఇవ్వరని కాంట్రాక్టర్‌ పౌలును ప్రశ్నించగా మంత్రి గారిని అడగండి మంత్రి గారి చెప్తేనే నీరిస్తామన్నారు. దీంతో మంగళవారం సాయినగర్‌ గ్రామస్తులకు తాగునీరు లేక గొంతెండినట్లయింది. అధికారంలో ఉన్న వారు తాగునీరు అందించక ఇస్తున్న వారిని ఇవ్వనివ్వకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో సాయినగర్, శివరాజ్‌నగర్‌ గ్రామస్తులకు తాగునీరు లేక ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి.

బూచేపల్లి చొరవతో..
అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నీరివ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కలుగజేసుకుని తామే స్వయంగా మేడే రోజు సాయినగర్‌లో ట్యాంకును ప్రారంభించారు. అయితే మంగళవారం ఎన్‌ఎపీ కార్యాలయం వద్దకు ట్యాంకును తీసుకుని ఆ గ్రామ ఎంపీటీసీ భర్త కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, డ్రైవర్‌ రెడ్డిచర్ల ఆంజనేయులు వెళ్లగా మంత్రి శిద్దా ఆదేశాలంటూ నీరిమ్మని కాంట్రాక్టర్‌ వరగాని పౌల్‌ తెగేసి చెప్పారు.

ఓ వైపు గ్రామస్తుల గొంతెండుతుంటే మరో వైపు మంత్రి ఆదేశాలు అంటూ కుటిల రాజకీయాలు చేయడం ఏంటని స్థానికులు కాంట్రాక్టర్‌ తీరును తప్పుపడుతున్నారు. మరుసటి రోజు కూడా ట్యాంకర్‌కు తాగునీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Advertisement
Advertisement