Sakshi News home page

పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా

Published Wed, Feb 19 2014 12:45 AM

పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా

నోబెల్ అవార్డు గ్రహీత హరాల్డ్ జూర్ హాసెన్ సూచన
వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపు

 
 సాక్షి, హైదరాబాద్: గర్భాశయ ముఖద్వార కేన్సర్(సర్వైకల్ కేన్సర్) నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ కేన్సర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) కారణమని గుర్తించిన ఈ శాస్త్రవేత్త మంగళవారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో విలేకరులతో మాట్లాడారు.
 
  హాసెన్ పరిశోధనలు ఆసరాగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. సర్వైకల్ కేన్సర్‌తోపాటు కొన్ని ఇతర రకాల కేన్సర్ల నివారణకు మల్టీవాలెంట్ (వేర్వేరు వైరస్‌లను ఒకే టీకాతో నియంత్రించేవి) వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ వైరస్ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లయితే హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
-  ఎనిమిదేళ్లుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా సాగడం లేదు. వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువ కావడమే కారణం.
-  అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛందసంస్థల సాయంతో తక్కువధరకే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.
-  అన్ని రకాల కేన్సర్లను జయించేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.
-  కొన్నిరకాల పశుమాంసం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశముందని మేం జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. దీన్ని నిర్ధారించేందుకు ఆయా పశువుల రక్తంలో ఉన్న కొన్ని వినూత్న వైరస్‌లను వేరు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నాం.
-  సీసీఎంబీ డెరైక్టర్ సి.హెచ్.మోహన్‌రావు మాట్లాడుతూ దేశంలో సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్ రూ.8 వేలకు లభిస్తోందని, కొన్నిదేశాల్లో గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్(గావి) వంటి సంస్థలు రూ.300కే దీనిని అందుబాటులోకి తెస్తున్నాయని చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement