నో పామోలిన్ | Sakshi
Sakshi News home page

నో పామోలిన్

Published Thu, Oct 2 2014 12:22 AM

నో పామోలిన్

సాక్షి, కడప/ బద్వేలు  :
 దసరా, బక్రీద్, దీపావళి .. ఈ పండుగలన్నీ అక్టోబర్ నెలలోనే వస్తున్నాయి. కనీసం పండుగ వేళన్నా పిండి వంటలు చేసుకుందామనుకుంటే వంట నూనె, కందిపప్పును చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయడం లేదు. జిల్లాలో ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా కావడం లేదు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కందిపప్పుది కూడా అదే పరిస్థితి. రెండు నెలలుగా కందిపప్పు అందడం లేదు. జిల్లాలో 7,56,833 మంది పేదలకు తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా బియ్యం, కిరోసిన్, పంచదార, పామోలిన్, కందిపప్పును ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

కొన్ని నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే అందిస్తున్నారు. పామోలిన్, కందిపప్పును పట్టించుకోవడం లేదు. ప్రతి నెల 7.8లక్షల కిలోల పామోలిన్‌ను సరఫరా చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ిలో రూ.65 వరకు ఉంది. చౌక దుకాణాల్లో రూ.40కే అందించేవారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.13, కేంద్ర ప్రభుత్వం రూ.10 వంతున భరిస్తున్నాయి. ఇలా రూ.23 పోనూ రూ.40కే పేదలకు అందించేవారు. ప్రస్తుతం కాకినాడ పోర్టులో పామోలిన్ నిల్వలు పుష్కలంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం రాయితీని అందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాయితీ విషయాన్ని సకాలంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లక పోవడంతోనే ఇలా జరిగిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 అలాగే  ప్రతి నెలా జిల్లాలోని పేదలకు కందిపప్పు అందించాల్సి ఉంది. రేషన్ దుకాణంలో రూ.50లకు కిలో కందిపప్పు అందిస్తుండగా బహిరంగ మార్కెట్లోరూ.80 వెచ్చించాల్సి  వస్తోంది. కందిపప్పు సరఫరాను  ఒక కంట్రాక్టర్‌కు అప్పగించారు.  కందిపప్పును సరఫరా  చేయడంలో ఆ కంట్రాక్టర్ చేతులెత్తేశాడు. చక్కెర సరఫరాలోనూ అదే పరిస్థితి. ఒక్కో కార్డుదారునికి అరకిలో చొప్పున పంపిణీ చేస్తుండగా ముందుగా వచ్చిన వారికే డీలర్లు అందిస్తున్నారు. ఆలస్యంగా వస్తే లేదని చెబుతున్నారు. మూడు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకురాకపోవడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండడం చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది.
 
 ఏడు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ :
 రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కలుపుకుని దాదాపు ఏడు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ప్రభుత్వాలు మారినా పామోలిన్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం వరుస పండుగలు వచ్చినా పామోలిన్ సరఫరా కావడం లేదు.  ప్రతి వంటలోనూ పామోలిన్ వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్‌ను సర ఫరా చేయకపోవడంతో పేదలు పెదవివిరుస్తున్నారు.
 
 చౌక వస్తువుల్లోనూ కోత :
 జిల్లాలో 1735  చౌకదుకాణాలు ఉన్నాయి. అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులకు కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర, గోధుమలు మాత్రమే  పంపిణీ చేశారు. కందిబేడలు, ఉప్పు, చింతపండు, కారం పొడి తదితర వస్తువులకు మంగళం పాడారు.  పండుగల నేపధ్యంలో అయినా ఈ సరకులను పంపిణీ చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 




 

Advertisement

తప్పక చదవండి

Advertisement