పేరుకే జంక్షన్.. సమస్యలతో టెన్షన్ | Sakshi
Sakshi News home page

పేరుకే జంక్షన్.. సమస్యలతో టెన్షన్

Published Wed, Feb 12 2014 2:48 AM

not development of bhadrachalam railway line

125 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్ పాలకులు సింగరేణి ఫిర్కాలో బొగ్గు నిక్షేపాలను తరలించేందుకు కారేపల్లి రైల్వే జంక్షన్‌గా చేసుకుని ఇల్లెందు వరకు, వయా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) మణుగూరు వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. 1982లో మండలంలోని మాధారం గ్రామంలో డోలమైట్ ఖనిజం నిల్వలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని విశాఖ స్టీల్‌కు తరలించేందుకు కారేపల్లి రైల్వే జంక్షన్ నుంచి మాధారం వరకు లైన్ ఏర్పాటు చేశారు.

1996 వరకు బొగ్గు ఇంజన్‌లు, డీజిల్ ఇంజన్లతో ఈ మార్గంలో రైళ్లు నడిచాయి. ఆ తర్వాత విద్యుత్ లైన్‌లు వేసి 1996 డిసెంబర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజన్లతో రైళ్లు నడుపుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న కారేపల్లి రైల్వే స్టేషన్‌లో మాత్రం కనీస సౌకర్యాలు లేవు. ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.

 రైలు ఎక్కడమే కష్టం...
 కారేపల్లి మండలంలో ఉన్న పోచారం, కారేపల్లి, గాంధీపురం, చీమలపహాడ్ రైల్వే స్టేషన్‌లలో ప్లాట్ ఫాంలు ఎత్తు తక్కువగా ఉండడంతో పాటు పొడవుగా కూడా లేవు. దీంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్లాట్ ఫాం పొడవు తక్కువగా ఉండడంతో ఒక్కోసారి కంకర రాళ్లపై పడి గాయపడుతున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లలో కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగేందుకు చుక్క నీరు కూడా దొరకడం లేదు. మరోపక్క నిల్చునేందుకు నీడ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ ఫాంలపై షెడ్లు నిర్మించాలని ప్రయాణికులు పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

 కారేపల్లి రైల్వే జంక్షన్ అభివృద్ధిపై నిర్లక్ష్యం
 కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తున్నా అధికారులు మాత్రం కారేపల్లి రైల్వే జంక్షన్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారేపల్లి - ఇల్లెందు, కారేపల్లి - పేరుపల్లి, ఖమ్మం - ఇల్లెందు(గాంధీపురం గేటు) రైల్వే గేట్లకు అండర్ బ్రిడ్జిలు మాత్రం ఏర్పాటు చేయలేదు. అరగంటకోసారి గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు ఈ మార్గంలో వచ్చి వెళ్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు అనేకమార్లు రైల్వే అధికారులకు విన్నవించినా ఫలితం మాత్ర ం కరువైంది. అలాగే రొట్టమాకిరేవు, బస్వాపురం రైల్వే గేటు వద్ద కీపర్(వాచర్)లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 గాంధీపురం, చీమలపహార్ రైల్వే స్టేషన్‌లకు మధ్య చింతలపాడు వద్ద అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ రాకపోకలకు మాత్రం అనువుగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి రానున్న రైల్వే బడ్జెట్‌లోనైనా మండలంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూడాలని, జిల్లాలోని ఏకైక రైల్వే జంక్షన్ అయిన కారేపల్లిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement