రెండో విడత లేనట్లే! | Sakshi
Sakshi News home page

రెండో విడత లేనట్లే!

Published Thu, Jun 18 2015 2:48 AM

Not have a secound phase

అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా రైతులకు విత్తన వేరుశనగ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. వర్షాలు పడుతుండటంతో విత్తుకునేందుకు అన్ని మండలాల్లో రైతులు సిద్ధంగా ఉన్నా విత్తనకొరత వల్ల సమస్య నెలకొంది. ప్రభుత్వం రాయితీ విత్తనం అరకొరగా ఇచ్చి రైతులను మీ తిప్పలు మీరు పడండి అన్నట్లు వదిలేస్తోంది. గతంలో 5 నుంచి 5.50 లక్షల క్వింటాళ్లు అవలీలగా పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నా ఈ ఏడాది కేటాయించిన 3.28 లక్షల క్వింటాళ్లు కూడా అందించలేని పరిస్థితి. రాయితీ విత్తనంపై నమ్మకం పెట్టుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి.

మొదటి విడత విత్తన పంపిణీలోనే విత్తన కొరత ఏర్పడటంతో పంపిణీ కార్యక్రమం ప్రసహనంగా మారింది. కమిషనరేట్ అధికారులు రెండు విడతలుగా జిల్లాలో మకాం వేసినా, జిల్లా కలెక్టర్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని రోజువారీ సమీక్ష చేసినా, వ్యవసాయశాఖ జేడీ నిత్యం దృష్టి సారించినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ఒక్క మండలంలో కూడా తగినంత విత్తన నిల్వలు పెట్టకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతంలో మే నెలాఖరు నాటికి తొలివిడత పంపిణీ చేసి, జూన్‌లో మరో రెండు విడతలు... పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం ముందస్తు అంటూ రచించిన ప్రణాళికలన్నీ బెడిసికొట్టడంతో మొదటి విడత పంపిణీలోనే గందరగోళం నెలకొంది.

రోజు మార్చి రోజు పంపిణీ చేయాల్సివున్నా ఈ సారి 3, 5 తేదీల్లో అలా జరిగినా మూడో క్లస్టర్ గ్రామాల రైతులకు మాత్రం 14న పంపిణీ చేశారు. అందులోనూ విఫలమయ్యారు. 38 వేల క్వింటాళ్లు తక్కువ రావడంతో వచ్చిన రైతులకు కూపన్లు ఇచ్చి పంపారు. ఈనెల 18వ తేదీ లోగా కూపన్లు పొందిన రైతులందరికీ విత్తనకాయ ఇస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎంతవరకు నెరవేరుతుందనేది మరికొన్ని గంటల్లోనే తెలుస్తుంది.

ఇలా మొదటి విడత పంపిణీ పూర్తి చేయడానికి అష్టకష్టాలు పడుతున్న జిల్లా యంత్రాంగం ఇక రెండో విడత, మూడో విడత పంపిణీ చేస్తుందంటే నమ్మశక్యంగా లేదని ఆ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తనం పంపిణీ చేయలేమనే విషయం తెలియడంతో రైతుల దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. విత్తుకునేందుకు జూన్ సమయం కాదని, జూలై నెల మంచి అనుకూలమని ప్రకటనలు గుప్పిస్తున్నారు. విత్తుకు సమయం ఉన్నందున రైతులు విత్తనం కోసం ఆందోళన వద్దంటున్నారు.

రెండు, మూడో విడత విత్తన పంపిణీ ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రైతులే నేరుగా సొంతంగా కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లోకి సబ్సిడీ జమ చేస్తామని కొత్త ఎత్తుగడ వేశారు. దానికి సంబంధించి అధికారికంగా తమకు ఉత్తర్వులు రాలేదని వ్యవసాయశాఖ చెబుతుండటం విశేషం. అర్థాంతరంగా కొత్త పంపిణీ విధానం అమలులోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాకు కేటాయించిన 3.28 లక్షల క్వింటాళ్లలో ప్రస్తుతానికి 1.85 లక్షల క్వింటాళ్లు తెప్పించి రైతులకు అందజేశారు. ఎన్ని క్వింటాళ్లు పంపిణీ చేశారనే వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. జేడీఏ వర్గాలు ఒక లెక్క చెబుతుండగా కలెక్టర్ మరో లెక్క చెబుతున్నారు. మరో పక్క వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి 2.28 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశామని చెప్పడం విశేషం.

Advertisement
Advertisement