లైఫ్‌కి లేదు సెక్యూరిటీ! | Sakshi
Sakshi News home page

లైఫ్‌కి లేదు సెక్యూరిటీ!

Published Thu, Nov 2 2017 3:40 PM

not paid salaries for months  to RIMS Security Staff - Sakshi

ఒంగోలు సెంట్రల్‌: తిరుపతికి చెందిన జై బాలాజీ సెక్యూరిటీ సర్వీసెస్‌ నిర్వాకంతో స్థానిక రిమ్స్‌లో పని చేస్తున్న సిబ్బంది తిప్పలు పడుతున్నారు. గత 5 నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందలేదు. ప్రశ్నిస్తుంటేæ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలేదని ఒక సారి, ట్రెజరీలో బిల్లులు ఉన్నాయని మరో సారి, తక్కువ టెండర్లు వేసి ఇబ్బందులు పడుతున్నామని ఇంకోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రిమ్స్‌ డైరెక్టర్‌ను సంప్రదించినా పరిస్థితిలో మార్పు లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు భేష్‌..
ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టు ప్రకారం సెక్యూరిటీ సిబ్బందికి నెలకు రూ. 8,444ల జీతం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలను కల్పించాలి. అదే విధంగా వేతనంతో కూడిన సెలవులు కూడా ప్రతి నెలా మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ సిబ్బందికి నియామక పత్రాలు, ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి. ఒక నెల వేతనంతో పాటు పీఎఫ్‌ను సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తేనే ఆ పత్రాలు రిమ్స్‌ అధికారులు పరిశీలించిన తరువాత సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు అనుమతులు మంజూరు చేయాలి. అయితే ఇలాంటి నింధనలు ఏవీ రిమ్స్‌లో అమలు జరుగడంలేదు. వీటిని పట్టించుకోవాల్సిన రిమ్స్‌ అధికారులు గానీ, కార్మిక శాఖ అధికారులు గానీ పట్టించుకోక చోద్యం చూస్తున్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఔట్‌ సోర్సింగ్‌ చట్టం ప్రకారం అయితే సెక్యూరిటీ సిబ్బందికి రూ. 12000 వేలకు పైగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.

అనుమతులు రావాలట..
కార్మికులకు అందుతున్న వేతనాలు, సేవలపై పరిశీలించాల్సిన కార్మిక శాఖ అధికారులు, పెద్ద కాంట్రాక్టర్‌ల జోలికి వెళ్లడంలేదు. తమకు పై అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే పరిశీలిస్తామంటున్నారు. ఇదిలా ఉంటే కార్మిక సంఘాలు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేశాయి. అయితే తమకు లేబర్‌ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు అందితేనే రిమ్స్‌ను సందర్శిస్తామని తేల్చి చెబుతున్నారు.

దొంగతనాలు..
కాంట్రాక్టు ప్రకారం రిమ్స్‌ వైద్యశాల, కళాశాలలో 73 మంది కాంట్రాక్టు సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. వీరిలో 67 మంది రెగ్యులర్‌గా 6 గురు రిజర్వ్‌గా ఉండాలి.

అయితే కేవలం 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కూడా ప్రతి రోజూ 6 గురు సెలవులో ఉంటున్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది లేకపోవడం వలన వైద్యశాలలో పేషెంట్లకు చెందిన అటెండర్ల సామగ్రిని దొంగలు తస్కరిస్తున్నారు.

రిమ్స్‌ డైరెక్టర్‌దే బాధ్యత:
సెక్యూరిటీ గార్డులకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. కాంట్రాక్టు పొందిన జై బాలాజీ సంస్థ వారు అయితే ఇక్కడ బినామీని పెట్టారు. కాంట్రాక్టులో ప్రతి నెలా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై అనేక సార్లు రిమ్స్‌ డైరెక్టర్‌కు  ఫిర్యాదు చేశాం. కాంట్రాక్టు సిబ్బంది చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత రిమ్స్‌ డైరెక్టర్‌పైనే ఉంది.
– ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ సర్దార్‌

జీతాలు ఇవ్వాలని ఆదేశించాం:
బిల్లులు మంజూరు అయినా, కాకపోయినా ప్రతి నెలా సిబ్బందికి వేతనాలు అందించాల్సిన బాధ్యత సెక్యూరిటీ కాంట్రాక్టర్‌దే. జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం.  
 – రిమ్స్‌ డైరెక్టర్‌: వల్లీశ్వరి

Advertisement
Advertisement