Sakshi News home page

4 రోజులైనా విచారణ లేదు

Published Sat, Mar 4 2017 2:03 AM

4 రోజులైనా విచారణ లేదు

10 మంది మరణించినా దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై కదలిక లేదు
గురువారంనాటి రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం


సాక్షి, అమరావతి: దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇది జరిగి 4 రోజులైంది. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రం. ఇంతవరకు న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ మరణించలేదు. కానీ, ఈ రెండు ప్రమాదాల్లో బస్సులు చిన్న సంస్థలవి కావడం, అధికార పార్టీ నేతలకు చెందినవి కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఇదే వేగాన్ని 10 మందిని బలితీసుకున్న  దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ఘటనపై చూపలేదు. ఈ సంస్థ అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానిది కావడంవల్లే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.  

కనీసం తనిఖీలూ లేవు..
ఆలిండియా టూరిస్ట్‌ పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముండ్లపాడు ఘటనతో పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం తమ సరిహద్దుల్లో తిరుగుతున్న ఏపీ ట్రావెల్స్‌ బస్సులపై తనిఖీలు చేపట్టింది. ఏపీలోని ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపింది. పలు బస్సులకు సరైన పత్రాలు లేవని కేసులు నమోదు చేసింది. కానీ, ఏపీ రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు  చేయడంలేదు. ప్రభుత్వ పెద్దలు కొందరు అడ్డుపడుతుండటంవల్లే తామేమీ చేయలేక పోతున్నామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియాతో సర్కారు పెద్దలు ఎంతలా అంటకాగుతున్నారో దీనిని బట్టే అర్ధమవు తుంది. రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో బస్సుల వేగ పరిమితి, బ్రీత్‌ ఎనలైజర్లతో పరీక్షలు చేయాలి. రోజూ టోల్‌గేట్లు దాటే బస్సుల వివరాలు నమోదు చేయాలి. అవేమీ జరగడంలేదు. సర్కారు నుంచి సహకారం లేదని,సిబ్బందిని నియమించడంలేదని, బ్రీత్‌ ఎనలైజర్లు, స్పీడ్‌ గన్‌లు వంటి పరికరాల కొనుగోలుకు నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తనిఖీలు చేయలేకపోతున్నామని అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement