అమ్మకానికి పోస్టింగ్‌లు | Sakshi
Sakshi News home page

అమ్మకానికి పోస్టింగ్‌లు

Published Tue, Sep 16 2014 2:45 AM

Notes for sale

సాక్షి, నెల్లూరు: జిల్లాలో పలు ఉన్నతస్థాయి అధికారుల పోస్టులను అమ్మకానికి పెట్టారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. జిల్లాలో అధికారుల బదిలీలు జాతరను తలపిస్తోంది. బదిలీల పర్వానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కోరుకున్న పోస్టు దక్కించుకునేందుకు అధికారులు ఇటు అధికార పార్టీ నేతలను, అటు ఉన్నతాధికారులనూ ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. నేతలతో పాటు అధికారులకు సైతం లక్షల్లో ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నారు. అక్టోబర్ 10 వరకు గడువు ఉండడంతో అధికారులు పైరవీల్లో మునిగారు. కొందరు హైదరాబాద్‌లో మకాం వేసి బేరసారాలు చేస్తున్నట్టు సమాచారం. రోడ్లుభవనాల శాఖ, పంచాయతీరాజ్, జెడ్పీ, ఐసీడీఎస్, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర శాఖల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు కోరుకున్న స్థానం, అనుకూలమైన ప్రాంతాల కోసం పైరవీలు సాగిస్తుండగా, ఇదేశాఖల పరిధిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరు అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు మరోవైపు బేరసారాలు సాగిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నెల్లూరు ఆర్డీఓ పోస్టు రూ.20 లక్షలు ఉండేది. నేడు ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. భారీ మొత్తంలో చెల్లించి ఇక్కడికి వచ్చేందుకు పలువురు అధికారులు పోటీ పడుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా కనీసం రెండు నెలలైనా తనను కొనసాగించాలని ప్రస్తుత ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి అధికార పార్టీ నేతలను  కోరుతున్నట్టు సమాచారం. ఈ పోస్టు కోసం పెంచలకిషోర్, కనకనరసారెడ్డి, రామచంద్రారెడ్డి 
 తదితరులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు కావలసిన పలువురు  సీనియర్ అసిస్టెంట్లు సీఎస్‌డీటీ పోస్టులు కావాలంటూ  జోరుగా  బేరసారాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఒక్కో సీఎస్‌డీటీ పోస్టుకు రూ. 3 లక్షలకు తక్కువలేకుండా ముట్టజెబుతామని వారు సంబంధిత అధికారుల వద్ద బేరం పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ నేతలకు సైతం భారీగానే డబ్బులు ముట్టజెప్పి  వారి సిఫార్సు లెటర్స్ సైతం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారికి ఇప్పటికే కొందరు డబ్బులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇక గృహనిర్మాణ సంస్థలో సైతం బదిలీల వ్యవహారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పీడీగా ఉన్న వెంకటేశ్వరరెడ్డి బదిలీపై వెళ్లనున్నారు. దీంతో ఈ పోస్టుకు గిరాకీ ఏర్పడింది. పలువురు అధికారులు  పీడీ పోస్టు కోసం బేరసారాలు సాగిస్తున్నారు. కడపకు చెందిన రామచంద్రారెడ్డి గృహనిర్మాణ శాఖ పీడీగా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. రామచంద్రారెడ్డి ప్రస్తుతం తూర్పుగోదావరి డ్వామా పీడీగా ఉన్నారు. రోడ్లుభవనాలశాఖలో  బదిలీల వ్యవహారం  ప్రహసనంగా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పని చేయాల్సిన వర్క్‌ఇన్‌స్పెక్టర్లు,ఏఈలు  యూనియన్లను అడ్డుపెట్టుకొని అధికారుల ఉత్తర్వులు బేఖాతరు చేసి అధికార పార్టీ నేతల అండతో పదుల సంవత్సరాలుగా నెల్లూరులోనే మకాం వేశారు. వీరిని కదిలించడం ఆశాఖకు  తలకు మించిన భారంగా మారింది. తాజాగా జరగనున్న బది లీల్లోనైనా వీరిని మారుస్తారో లేదో చూ డాలి. ఇప్పటికే వారు అధికార పార్టీ నేతల అండతో బేరసారాల్లో మునిగితేలుతున్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలోనూ పైరవీల జోరు కొనసాగుతోంది. కోరుకున్న ప్లేస్ కోసం అధికారులు ముందుకు సాగుతున్నారని సమాచారం. ఈ పోస్టులు లక్షల్లో ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.
 విద్యాశాఖ తీరేవేరు
 ఇక జిల్లా విద్యాధికారి పోస్టుకు సైతం పోటీ హోరాహోరీగా నడుస్తోంది. గతం లో విద్యాశాఖాధికారిగా ఉన్న  మువ్వా రామలింగం  అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ అయ్యారు. దీంతో  ఏప్రిల్  నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాకు తిరిగి రావడానికి మువ్వా చేయని ప్రయత్నమంటూ లేదు. దీంతో ఈ సీటుకు రేటు పెరిగింది. ఏకంగా మంత్రి, ఎమ్మెల్సీ ప్రమేయంతో చిత్తూరు డీఈఓ   ప్రతాప్‌రెడ్డి  నెల్లూరుకు వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఇక అవినీతి రాజ్యమేలుతున్న జిల్లా ఆరోగ్యశాఖలోనూ పైరవీల జోరు పెరిగింది. కోరుకున్న పోస్టుల కోసం అధికార పార్టీ నేతలతో ఇక్కడి అధికారులు బేరసారాలు కుదుర్చుకుంటున్నట్టు  సమాచారం. ఇక నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు మిగి లిన మున్సిపాలిటీల పరిధి లో పని చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. సంబంధితశాఖ మంత్రి నారాయణ సొంత జిల్లా కావడంతో డిమాండ్ మరింత పెరి గింది. మంత్రి అనుచరులు కొందరు భారీ ఎత్తున ముడుపులు  దండుకుని కొలువులు ఖరారు చేసినట్టు విస్తృత ప్రచారం సాగుతోంది. వీటితో పాటు అన్నిశాఖల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
 
 
అధికారుల, అమ్మకానికి, బదిలీలు
 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement