ఇక పోస్టల్ ఏటీఎం సెంటర్లు | Sakshi
Sakshi News home page

ఇక పోస్టల్ ఏటీఎం సెంటర్లు

Published Sat, Dec 7 2013 5:09 AM

Now postal ATM centers in prakasam district

 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తపాలా శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇప్పటి వరకు బ్యాంకులకే పరిమితమైన ఏటీఎం సెంటర్లను పోస్టాఫీసుల్లోనూ నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, చీరాలతో పాటు కనిగిరిలో హెడ్ పోస్టాఫీసులున్నాయి. తొలుత కనిగిరి హెడ్‌పోస్టాఫీసులో ఏటీఎం కేంద్రం పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం హైదరాబాద్, విజయవాడ నుంచి సాంకేతిక, ఇంజినీరింగ్ నిపుణుల బృందం వచ్చి కనిగిరి కార్యాలయాన్ని పరిశీలించింది. వచ్చే ఏడాది మార్చిలోపు కనిగిరిలో పోస్టల్ ఏటీఎంను నెలకొల్పేందుకు సాధ్యాసాధ్యాలు బేరీజువేస్తూ ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, చీరాల, ఒంగోలుల్లోని హెడ్ పోస్టాఫీసుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తారు. ఈమేరకు న్యూఢిల్లీలోని తపాలాశాఖ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పి.గోపీనాథ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
 
 జిల్లాలో 1.64 లక్షల ఎస్‌బీ ఖాతాదారులు
 ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధిలో మొత్తం 1 లక్షా 64 వేల 260 మంది సేవింగ్స్ బ్యాంకు (ఎస్‌బీ) ఖాతాదారులున్నారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఆ అకౌంట్‌లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒంగోలు హెడ్ పోస్టాఫీసు పరిధిలో 58,280 మంది, చీరాలలో 36,680, కందుకూరులో 35,880, కనిగిరిలో 32,420 మంది ఎస్‌బీ ఖాతాదారులు తపాలాశాఖ నుంచి ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు హెడ్‌పోస్టాఫీసుల పరిధిలో 96 సబ్ పోస్టాఫీసులు, 504 బ్రాంచి పోస్టాఫీసులున్నాయి.
 
 ఎస్‌బీ ఖాతాల పరిశీలన మొదలు
 ఏటీఎం సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే ప్రాథమికంగా వాళ్ల పరిధిలో ఉన్న ఎస్‌బీ ఖాతాలను పరిశీలించి వాటి వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని సబ్ పోస్టాఫీసులు తమ కార్యాలయ పరిధిలోని ఖాతాలను తాజాగా లావాదేవీలు జరుపుతున్నట్లు ధ్రువీకరించి సర్టిఫై చేస్తారు. గత సంవత్సరం నుంచి జరుగుతున్న లావాదేవీలను కంప్యూటర్లలోకి ఎక్కిస్తారు. ఈ విధంగా ఆయా సబ్‌పోస్టాఫీసుల పరిధిలోని బ్రాంచి పోస్టాఫీసుల్లో కూడా ఉన్న ఎస్‌బీ అకౌంట్లను సైతం పరిశీలించి సర్టిఫై చేస్తున్నారు. అయితే వినియోగదారుల్లో పెద్దగా స్పందన కనపడడం లేదు. పోస్టల్ సిబ్బంది ఎస్‌బీ ఖాతాలను తెచ్చి వాటిని పరిశీలించుకుని వెళ్లాలని చెప్పినా రావడం లేదు. ఖాతాదారులందరూ త్వరితగతిన పరిశీలించుకుంటే ఏటీఎం ప్రాసెస్ త్వరగా పూర్తవుతుందని జిల్లా పోస్టల్ అధికారులు అంటున్నారు.
 
 

Advertisement
Advertisement