‘గిరి’జన గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

‘గిరి’జన గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలల ఏర్పాటు

Published Sat, Nov 23 2013 3:18 AM

NRSTC schools set up in tribal villages

సీతంపేట, న్యూస్‌లైన్:  గిరిజన గ్రామాల్లో డ్రాపౌట్లు నివారించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో 190 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ (నాన్‌రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేశారు. గిరిజన ప్రాంతాల్లో బడివయసు పిల్లలందరూ బడికి వెళ్లాలనే ప్రధాన ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభంలో శాటిలైట్ పాఠ శాలలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో సుమారు 1716 మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మిగిలారు. వీరంతా తల్లిదండ్రులతో కలిసి పోడు వ్యవసాయంలో పాల్గొంటున్నారు. వీరందరినీ ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 గ్రామంలో చదువుకున్నవారే ఉపాధ్యాయులు
 శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసే గ్రామంలో అర్హులైన అభ్యర్థులను బోధకులుగా నియమించనున్నారు. వీరికి రూ.2,500లుగా గౌరవవేతనం  నిర్ణయించారు. వీరు ఇంటింటికి వెళ్లి పిల్లలను పాఠశాలకు చేర్చి చదువు చెబుతారు. ప్రధాన పాఠశాలలకు అనుబందంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్నబోజన పథకం అమలు కానుంది. యూనిఫారాలను విద్యార్థులకు అందజేస్తారు.
 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాల ఏర్పాటు
 ఎనిమిదేళ్ల వయసు పైబడి చదవని వారు, చదివి డ్రాపౌట్ అయిన వారిని ఈ కేంద్రాల్లో చేర్చుతారు.  వీరికి మూడు పూటల భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. సీతంపేట మండంల హడ్డుబంగి, ఓండ్రుజోల, కొత్తూరు, భామిని మండలం మనుమకొండ, బూర్జ మండలం పెద్దపేటలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మూడు పూటల విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రత్యేక ఉపాధ్యాయులతో చదువులు చెప్పించి వారి వయసుకు తగ్గట్టుగా వివిధ ఆశ్రమ పాఠ శాలలో చేర్పించనున్నారు.

Advertisement
Advertisement