గాజువాక టీడీపీలో ఆ నలుగురు | Sakshi
Sakshi News home page

గాజువాక టీడీపీలో ఆ నలుగురు

Published Thu, Mar 27 2014 2:24 AM

గాజువాక టీడీపీలో ఆ నలుగురు - Sakshi

  •     టికెట్‌పై కుదరని సయోధ్య
  •      గందరగోళంలో అధినేత
  •      కార్యకర్తల్లో నైరాశ్యం
  •   గాజువాక, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ గాజువాక టీడీపీలో అసమ్మతి రాజుకుంటోంది. కాంగ్రెస్ నాయకులు చేరడంతో గ్రూపుల జాబితా పెరిగింది. ప్రతి గ్రూపు నుంచీ ఒకరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తుండటంతో అధినేత చంద్రబాబు సైతం గందరగోళంలో పడ్డారు. మొన్నటి వరకు ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్గదర్శకత్వంలో రెండు గ్రూపులు నడిచాయి.

    తాజాగా గాజువాక ఫైవ్‌మెన్ కమిటీని ఆ పార్టీ సీనియర్ నాయకుడు హర్షవర్థన్ ప్రసాద్ తెరపైకి తెచ్చారు. ఇది బండారు నేతృత్వంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిం ది. అయ్యన్న మద్దతుతో కోన తాతారావు మరో గ్రూపును నడిపిన విషయం తెలిసిందే. చింతలపూడి వెంకట్రామయ్య మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీలో ఇటీవల చేరారు. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ కష్టమన్న విషయం గ్రహించిన ఆ పార్టీ గాజువాక ఇన్‌చార్జి పల్లా శ్రీనివాసరావు కూడా రెం డు రోజుల క్రితమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

    ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు, టి.హర్షవర్థన్‌ప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు గాజువాక టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అధినేతతో నేరుగా హర్ష మాట్లాడుతున్నట్టు సమాచారం. కోనకు టికెట్ ఇవ్వాల్సిందేనని అయ్యన్నపాత్రుడు పట్టుపడుతున్నట్టు తెలిసింది. గంటా బృందం చేరికను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నందున ఆయన్ని చల్లబర్చడం కోసం టికెట్‌ను కోనకు కేటాయిస్తానని అధినేత హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

    మరో పక్క వెంకట్రామయ్య నేరుగా రంగంలోకి దిగారని కార్యకర్తలంటున్నారు. యనమల రామకృష్ణుడు మద్దతుతో తనకే టికెట్ వస్తుందని పల్లా శ్రీనివాసరావు ధీమాగా ఉన్నారు. ఒకవేళ పార్లమెంట్‌కు పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే పాటించాలని ముందుగానే ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయనకు ఏదో ఒక టికెట్ తప్పనిసరి అని భావిస్తున్నారు. నాలుగు గ్రూపుల్లో టికెట్ ఎవరికి వచ్చినా మిగిలిన గ్రూపువారు సహకరించే పరిస్థితి లేకపోగా, ఒకరిద్దరు నాయకులు మాత్రం స్వతంత్రులుగానైనా బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నైరాశ్యానికి గురి చేస్తున్నాయి.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement