మద్యంతో పాటు ఉచితంగా స్నాక్స్‌.. | Sakshi
Sakshi News home page

ఆఫర్ల నిషా

Published Sat, Sep 28 2019 1:00 PM

Offers in Wine Shops For New Policy Starts - Sakshi

పశ్చిమగోదావరి, భీమవరం: మద్యం ప్రియులకు తక్కువ ధరకే కిక్కెంచేందు వైన్‌ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30తో పాత మద్యం విధానం ముగుస్తుండడంతో షాపుల్లో ఉన్న మద్యం నిల్వలను క్లియర్‌ చేసుకునేందుకు కొంతమంది యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇవ్వడంతో పాటు మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్‌ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెబుతున్నారు.  టీడీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా 474 మద్యం షాపులు ఏర్పాటు చేశారు. వీటి కాలపరిమితి జూన్‌ నెలాఖరు నాటికే ముగిసినప్పటికీ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలల పాటు పొడిగించింది. అంతేగాకుండా మద్యం షాపుల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించడంతో గత మూడు నెలలుగా మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ «విక్రయాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంది. దాంతో పాటు గతంలో ఉన్న షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించింది.  దీనితో జిల్లాలో ప్రస్తుతం 379 షాపులు మాత్రమే ఏర్పాటు కానున్నాయి.

భీమవరం ఎక్సైజ్‌ డివిజన్‌ ప్రాంతంలో 238, ఏటూరు పరిధిలో 236 షాపులు ఏర్పాటు కానున్నాయి. మద్యం షాపులను అద్దెకు తీసుకుని విక్రయాలకు సిబ్బందిని నియమించి వారికి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టింది. జూన్‌తో గడువు ముగిసిన షాపుల్లో కొంతమంది రెన్యువల్‌ చేసుకోకపోవడంతో వాటిలో 76 షాపులను సెప్టెంబర్‌ నెల నుంచి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నూతనంగా ఏర్పాటయ్యే మద్యం షాపుల్లో మద్యం విక్రయాల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్ణయించారు. మద్యం షాపుల వద్ద ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలి, 18 ఏళ్లలోపు వయసు గల వారికి మద్యం విక్రయించకూడదనే నిబంధనలున్నాయి. గుడి, బడి, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలోను జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంగా షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఆఫర్లకు రంగం సిద్ధం
గత రెండేళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్న వారికి ఈనెలాఖరునాటికి గడువు ముçగుస్తుండడంతో షాపుల్లోని సరుకును ఖాళీ చేసేందుకు షాపుల యజమానులు ఆఫర్లు ప్రకటించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. షాపుల్లో మిగిలిపోయిన మద్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి సొమ్ములు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది యజమానులు స్థానికంగానే సరుకును వదిలించుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. దీంతో మద్యం ధరలను ఎంఆర్‌పీ కంటే తగ్గించడంతో పాటు మద్యం షాపుల వద్దనే సేవించేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటిపళ్లు వంటి స్నాక్స్‌ను ఉచితంగా అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. కొంతమంది యజమానులు మద్యం షాపుల్లో గత నెల రోజుల నుంచి తక్కువ సరుకు పెడుతున్నప్పటికీ మద్యం జోరుగా విక్రయాలు జరిగే షాపుల్లో పెద్ద మొత్తంలో సరుకు నిల్వలున్నట్లు చెబుతున్నారు. దీనితో గడువు ముంచుకొస్తున్నందున సరుకును వదిలించుకునేందుకు ఆఫర్లు ప్రకటించనున్నారని చెబుతున్నారు. అయితే కొంతమంది సిండికేట్‌గా ఉన్న షాపుల యజమానులు తమ వద్ద మద్యం సరుకును సభ్యుల సంఖ్యను బట్టి వాటాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది స్నేహితులు, బంధువులకు పంపకాలు చేయడానికి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మద్యం పాలసీ మారడంతో మద్యం ప్రియులకు తక్కువ ధరకే మద్యం లభించడంతో పాటు ఉచితాలు కూడా దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement