నిధులున్నా నిర్లక్ష్యం..! | Sakshi
Sakshi News home page

నిధులున్నా నిర్లక్ష్యం..!

Published Sat, Dec 28 2013 3:45 AM

officers negligence on roads

భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి పుష్కలంగా నిధులు ఉన్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో పనులు పూర్తి కావటం లేదు. మారుమూలన ఉన్న రెండువందల గ్రామాలకు మెరుగైన రహదారులు కల్పించేందుకని జిల్లాకు రూ.43.62 కోట్లు మంజూరై రెండేళ్లు దాటినా  ఈ పనులు అతీ గతీ లేకుండా సాగుతున్నాయి. గడువులోగా పనులు పూర్తి చేయకపోవటంతో మరోసారి వీటి అంచనాలను పెంచుతూ ప్రతిపాదనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు అలసత్వం, లోప భూయిష్టమైన విధానాలతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మారుమూలన ఉన్న కుగ్రామాలకు రహదారులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.  ఈ క్రమంలో జిల్లాకు రూ.38.5 కోట్లు కేటాయిస్తూ  2011లో జీవో నంబర్ 129 పేరిట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఈ పనులను పంచాయతీ స్థాయిలో ఏర్పడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతోనే చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పనులను చేజిక్కించుకొని ఉపాధి నిధులను కొల్లగొట్టాలనుకున్న అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌లకు ఈ నిబంధనలతో గొంతులో వెలక్కాయపడింది. దీంతో ప్రభుత్వంపై వారు ఒత్తిడి తీసుకురావటంతో ఈ నిబంధనలను సవరిస్తూ ఏడాది తరువాత అనగా 2012 జులైలో మరో ఉత్తర్వు ఇచ్చింది.

200 పనులకు రూ. 43.62 కోట్లకు నిధులను పెంచుతూ 60:40 నిష్పత్తిలో చేపట్టాలని సూచించింది. దీని ప్రకారం 60 శాతం నిధులు ఉపాధి కూలీలకు, మిగతా 40 శాతం నిధులు మెటీరియల్ కోసం వెచ్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  దీంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ క్షేత్ర స్థాయిలో సవాలక్ష సమస్యలు ఎదుర య్యాయి.

 ముందుకుసాగని పనులు...
  2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులతో చేపట్టిన ఈ పనులను అధికారులు సకాలంలోపూర్తి చేయించటంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.  జిల్లాలోని ఏజె న్సీ ప్రాంతంలో గల 19 మండలాల్లో  ఈ 200 పనులను ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించారు. ఇప్పటికే ఎల్‌డ బ్ల్యూఈఏ పథకం కింద వందలాది కోట్లతో పనులు జరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక విభాగానికి అప్పగించారు. పనులు పర్యవేక్షించేందుకు ఆయా మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఐటీడీఏ స్థాయిలో పరిశీలించేందుకు కన్సల్‌టెంట్లు ఇలా అదనపు సిబ్బందిని నియమించారు.

ఇంత ప్రత్యేక యంత్రాంగం ఉన్నప్పటికీ పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నెల 9న రూపొందించిన నివేదికల ప్రకారం మొత్తం 200 పనుల్లో 65  చోట్ల అసలు తట్టెడు మట్టి కూడా పోయలేదు.  రూ.43.62 కోట్లకు గాను ఇప్పటికి అధికారులు నివేదికల ప్రకారం కేవలం రూ.6.79 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. పనుల పురోగతి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు తగిన రీతిలో దృష్టి సారించటం లేదనే విమర్శలు ఉన్నాయి.

 కాంట్రాక్టర్‌ల కనుసన్నల్లోనే...
 ఉపాధి హామీ పథకం కింద జరగాల్సిన రహదారుల నిర్మాణపు పనులు చాలా చోట్ల కాంట్రాక్టర్‌లే చేపట్టారు. కూనవరం, దుమ్ముగూడెం వ ంటి చోట్ల కూలీలను ఉపయోగించకుండానే నిధులను కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఆయా రహదారుల నిర్మాణానికి 60 శాతం నిధులు కూలీలకే వెచ్చించాలి. అయితే కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు చేసి పెద్ద మొత్తంలో నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.  కాంట్రాక్టర్‌లు ఇచ్చే కమీషన్‌లు తీసుకున్న  పర్యవేక్షణాధికారులు పనులు అయితే చాలన్న రీతిలో చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

 ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా కాంట్రాక్టర్లే చేపడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. గడువు ప్రకారం మార్చి నాటికి పనులు పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో దీనిపై ఐటీడీఏ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మూడేళ్ల క్రితం చేసిన ఎస్టిమేషన్‌లతో వీటిని పూర్తి చేయటం తమ వల్ల కాదని చేతులెత్తేసిన అధికారులు వీటి అంచనాలను పెంచుతూ మళ్లీ కొ త్తగా ప్రతిపాదనలు తయారు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. గడువులోగా పనులు పూ ర్తి చేసేందుకు శ్రద్ధ చూపకపోగా కాంట్రాక్టర్‌ల కు లబ్ధిచేకూర్చేందుకు ప్రయత్నాలు చేయటం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 రహదారులు లేక
 పల్లె వాసులు ఇబ్బందులు :
 ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించాలనే లక్ష్యంతోనే ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద నిధులు కేటాయించారు. అధికారుల నిర్వాకం కారణంగా ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమ గ్రామాలకు రహదారులు మెరుగుపడలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో వెనుకబడిన చింతూరు, పినపాక, కూనవరం, వీఆర్‌పరం, ఇల్లెందు, టేకులపల్లి వంటి మండలాల్లోనే ఎక్కువగా పనులు గుర్తించారు. ఆయా మండలాల్లో గల గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా పల్లె వాసులకు ప్రయాణపు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement