రైతులంతా ఒక్కటై.. | Sakshi
Sakshi News home page

రైతులంతా ఒక్కటై..

Published Thu, Nov 27 2014 2:07 AM

రైతులంతా ఒక్కటై.. - Sakshi

కొడవలూరు : వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులను ఈ ప్రభుత్వం ఎడాపెడా నట్టేట ముంచుతోంది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని హామీల వర్షం కురిపించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏతావాతా నడ్డి విర్రగ్గడుతోంది. ప్రకృతిని ఎలాగో శాసించలేం.. కానీ రైతులను ఆదుకునేందుకు చేయగలిగిన పనులకు ఈ పాల కులు ముఖం చాటేశారు. అదనొచ్చిందని పంట కాలువల్లో పూడిక తీయించమని అధికారులు చెప్పినా చెవికెక్కించుకోలేదు. పాలకులకు మొరపెట్టుకున్నా.. ఆలకించలేదు. విసిగి వేసారిన రైతులు చేయి చేయి కలిపి కాలువల్లో పూడ్చి తీయించేందుకు సిద్ధమవుతున్నారు.

 నియోజకవర్గంలోని బుచ్చి, కొడవలూరు, విడవలూరు మండలాలకు ప్రధాన నీటి వనరు మార్గం తూర్పు కాలువే. ఈ కాలువ కింద సుమారు 70 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులంతా ఈ కాలువ పైనే ఆధారపడి సాగు చేస్తారు. ఈ కాలువ పూర్తిగా తూటాకు, పచ్చికతో పూడిపోవడంతో పాటు దీని బ్రాంచి కాలువలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి కాలువల్లో పూడిక తీయించకపోవడంతో ఏటా సాగు నీటికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

రబీ సీజన్ వచ్చి రెండు నెలలు గడుస్తోంది. కానీ వర్షం జాడలేదు. పోని సోమశిల నీరైనా వస్తుందనుకుంటే కాలువల దుస్థితి రైతాంగాన్ని ఈ ఏడాది ఆందోళనకు గురి చేస్తోంది. నార్లు పోసుకునే సమయానికి కాలువలకు నీటి విడుదల జరిగింది. అదే సమయంలో కాలువల్లో పూడిక తీత కూడా జరగాలి. కానీ ప్రజాప్రతినిధులు జన్మభూమి సభల్లో పూడిక తీత పనులు వెంటనే చేపట్టి రైతులను ఆదుకుంటామని హామీలు గుప్పించారు. అయితే సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నిధుల విడుదల జరగలేదంటూ మిన్నకుండిపోయారు.

ఇప్పటికే రైతులు నార్లు పోసుకుని నాట్లు వేసుకుంటున్నారు. కాలువ ద్వారా మాగాణికి నీరందే పరిస్థితి లేకపోవడం, అధికారుల నుంచి పూడికతీత పనులపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకుంటే పంట వదులుకోవాల్సిందేనని రైతులు ఓ నిర్ణయానికి వచ్చారు. బ్రాంచి కాలువల్లో గరిక, సిల్ట్‌తో నిండి చుక్క నీరు కదలకపోవడంతో ఆయకట్టు రైతులే సొంతగా డబ్బు పోగు చేసుకుని తవ్వుకునేందుకు సిద్ధపడ్డారు. తలమంచి కాలువ కిందున్న బీ,సీ బ్రాంచి కాలువల కిందున్న ఆయకట్టు రైతులు బుధవారం నుంచి కాలువల్లో పూడిక తీత ఆరంభించారు.

రైతులను పూర్తిగా విస్మరించారు : గంధం వెంకటశేషయ్య, సీ బ్రాంచి కాలువ కింది రైతు
ప్రతి ఏడాది లాగే రబీలో కాలువల పూడిక తీత జరుగుతుందని ఆశించాం. కానీ నాట్లు పూర్తి కావస్తున్నా పూడిక తీత గురించి పట్టించుకున్న వారు లేరు. ఇప్పటికే నార్లు పోసుకున్న మేము కాలువల ద్వారా నీళ్లందక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ పరంగా పూడిక తీత జరిగే అవకాశాలు లేవు. రైతులమంతా కలిసి మాట్లాడుకుని సొంత డబ్బుతో కాలువలు పూడిక తీసుకుంటున్నాం.

పూడిక తీత అనివార్యం : కలిశెట్టి వెంకయ్య, బీ బ్రాంచి కాలువ ఆయకట్టు రైతు
బ్రాంచి కాలువలు పూర్తిగా పూడిపోయాయి. వీటిని తక్షణం పూడిక తీయకుంటే చుక్క నీరందవు. అందువల్లే రైతులమే సొంతగా డబ్బులు వేసుకుని పూడిక తీసుకుంటున్నాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement