పెన్షనర్ల గుండెల్లో టెన్షన్

2 Oct, 2014 03:39 IST|Sakshi
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్

* ఏపీలో లక్షల పింఛన్లపై వేలాడుతున్న వడపోత
* కత్తి కుంటిసాకులు చూపుతూ వేటేస్తున్న అధికారులు

 
 ఈ ఫొటోలోని బడ్నాన అప్పలస్వామి, నరసమ్మలు దంపతులు. అప్పలస్వామి వయసు 70 ఏళ్లు, నరసమ్మ వయసు 66 సంవత్సరాలు. వీరిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎరకందొరవలస గ్రామం. నిరుపేదలైన వీరికి గత ఏడాది రచ్చబండలో రేషన్‌కార్డు ఇచ్చారు. అప్పటి నుంచీ వీరికి వృద్ధాప్య పింఛను వస్తోంది. తాజాగా సర్కారు చేపట్టిన తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ దంపతులకు పింఛను కత్తిరించేశారు. వారు కాళ్లావేళ్లా పడ్డా.. స్థానిక నేతలు బతిమిలాడినా కనికరం చూపలేదు. ఇంతకీ పింఛను కత్తిరించటానికి అధికారులు చూపిన కారణం.. పండు ముదుసలులైన వీరిద్దరి ఫొటోలతో ఉన్న రేషన్ కార్డులో వారి వయసు 25 ఏళ్లు, 22 ఏళ్లుగా నమోదై ఉండటమే! రేషన్ కార్డు నమోదులో ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పును సాకుగా చూపి.. పండు ముదుసలులు కళ్లెదుట కనబడుతున్నా పింఛన్లు కత్తిరించేశారు!! ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సామాజిక పింఛన్లను ఏరివేయటానికి సర్కారు వారు ఎంతగా తహతహలాడుతున్నారో తెలియడానికి!!!  
 
 సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది.
 
  గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. ఇక తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు.  
 
 సర్కారు సాయంతో ఇల్లు కట్టుకున్నా కట్...
 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక.. అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పింఛన్ల జాతరలో  పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కాగా,   వేలిముద్రలతో సరిపోల్చుతూ ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ లేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు.
 
 నిరంతరం వేలాడనున్న వడపోత కత్తి...
 పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో  కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. ఈ జాబితా వడపోతను నిరంతరం కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబి తాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడిం చారు. సానుభూతితోనూ, మానవతా థృ క్పథం తో అందించే పింఛన్ల జాబితాపైనా ఇకపై ఆంక్ష ల పర్వం కొనసాగించాలని నిర్ణయించారు.
 
 నామమాత్ర కేటాయింపులతో ఎలా?
 ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్‌లో రూ. 1,338 కోట్లు మాత్ర మే కేటాయించారు. గడిచిన 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.650 కోట్లు అవు తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పు న, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున రూ. 3,080 కోట్లు కావాలి. గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తా న్ని కలిపితే కనీ సంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్‌లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
 
 పింఛన్ల కత్తిరింపు అమానవీయం: వైఎస్సార్‌సీపీ
 పింఛన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇపుడు కోతలు విధించడం అమానవీయం, అమానుషమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2 నుంచి పిం ఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశతో ఎదురు చూసిన లక్షలాది వృద్ధులు, వితంతువుల పింఛన్లను అడ్డంగా క త్తిరించి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు కోత లు పెడుతూ మరోవైపు ‘భరోసా’ ఇస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఆధార్ కార్డు లేదన్న కారణంగా 1.7 లక్షలు, అనర్హులంటూ 3.5 లక్షల మంది పింఛన్లకు కోత విధించారని విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతను కల్పించే ఈ పింఛన్లను సంతృప్తస్థాయిలో ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు.

మరిన్ని వార్తలు