యాబై ఏళ్ల జ్ఞాపకం... | Sakshi
Sakshi News home page

యాబై ఏళ్ల జ్ఞాపకం...

Published Wed, Feb 26 2014 2:29 AM

యాబై ఏళ్ల జ్ఞాపకం...

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
 భిక్కనూరు ఉన్నత పాఠశాల మొదటి హెచ్‌ఎస్‌ఎస్సీ బ్యాచ్
 సరదాగా సాగిన గోల్డెన్ జూబ్లీ అలుమ్నీ.
 మిగిలింది బ్యాక్ బెంచి గాళ్లమే..
 
 భిక్కనూరు,న్యూస్‌లైన్ :
 అరే...మెత్తం మారిపోయావు.... నేను గుర్తు పట్టలేదు... పిల్లల పెళ్లిళ్లు అయినాయా... అరే ప్రతాప్ నీవింకా యంగ్ టర్క్ వేరా...ఓరేయ్ సర్పంచ్ పదవి పొయింది ఇక్కడ నీ వేశాలేందిరా....అంటూ సరదా కామెంట్‌ల తో పాత మిత్రులు ఉత్సాహంగా గడిపారు. యాబై ఏళ్ల  అనంతరం అందరూ ఒకచోటికి చేరడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. భిక్కనూరు ఉన్నత పాఠశాల మొదటి హెచ్‌ఎస్‌ఎస్సీ 1964 బ్యాచ్ విద్యార్థులు మంగళవారం భిక్కనూరులో గోల్డెన్‌జూబ్లి వేడుకగా జరుపుకున్నారు. అందరూ అరవై, డెబ్బ ఏళ్లకు సమీపంలో ఉన్నవారే. మొత్తం అప్పటి  బ్యాచ్‌లో 18 మంది విద్యార్థులుండగా వారిలో 12 మంది ఇప్పుడు కలుసుకున్నారు. మిగతా వారు కాల ధర్మం చేశారు. వీరిలో ఏడుగురు గజిటెడ్ హోదాలో రిటైర్మెంట్ పొందారు. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన వీరు సందర్భం చూసుకుని సంతోషం, బాధను పంచుకున్నారు.
 
 అరే... ఫస్ట్ బెంచ్ బ్యాచ్ అందరూ పరలోకం కేగారే అనగానే ఒక నిమిషం నవ్వు... అంతలోనే బాధ.. వెనక బెంచి వారిమి కాబట్టే దేవుడు టికెట్ లేట్ చేస్తున్నాడంటూ సరదా కామెంట్‌లు సాయంత్రం వరకు సరాదా సరదా సెటైర్‌లతో గడిపారు. అరేయ్ తెలంగాణ ఉద్యమకారులంరా.. నేననప్పుడు  అప్పటి నాయకుడు మల్లికార్జున్ సభలో లొల్లి చేసినరా అంటే నీ....ముం....నువ్వెమన్న జైలుకు పోయినావ్‌రా అంటూ సెటైర్‌లు వదిలారు. (బట్టతలలనుచూసి) అరే అందరూ ఎకరాలకు ఎకరాలకు పొగొట్టుకున్నారు..ప్రతాప్ మాత్రం ఇంకా అట్లనే ఉన్నడంటే...
 
 అరే రంగు  పెడ్తే నే యంగ్ టర్క్‌నురా అంటూ ప్రతి విసుర్లు విసిరారు. పీఆ ర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు జగ్గన్నగారి ప్రతాప్‌రెడ్డి. అరే సంజీవా నీవు కష్టజీవివిరా... అప్పటినుంచి ఇప్పటిదాకా ఎవుసం చేస్తూ ఆదర్శ రైతుగా ఉంటున్నావురా... నీ సైకిల్ స్పీడ్ ఎవరికి వస్తదిరా అంటే పొండ్రిరా మీరు నాతో సమానం ఎప్పుడు వస్తర్రా అనగానే నవ్వుల పువ్వులు పూశాయి. అరే సబ్ రిజిస్ట్రార్ కుర్చిలో కూర్చుండి, కూర్చుండి వంగిపోయావురా అంటూ సిద్దయ్యను ఆట ప ట్టించారు. అందరూ మారినా దేవేందర్‌రెడ్డి మాత్రం అదే హుందాతనం అంటూ స్నేహితులు ఆటపట్టించారు. అలుమ్నిలో జె.ప్రతాప్‌రెడ్డి, ఎస్. వెంకట్రాజం, బి.పాండురంగ ం, డి.సంజీవరెడ్డి, ఎం.సిద్దయ్య, ఎ.రాంరెడ్డి, ఎస్.సిద్దరాంలు,ఎండిరసూల్,డి.బల్‌రాం,,ఎం.మాధవరెడ్డి,టి.దేవేందర్‌రెడ్డి, సి.నర్సింహారెడ్డి పాల్గోన్నారు.
 
 కలలో కూడా అనుకోలేదు...
 అందరం ఒకచోట కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. మూడు నెలల నుంచి ప్లాన్ చేసుకుని అందరం ఈ రోజు కలుసుకున్నాం. అందర్ని చూడగానే ఆ నాటి క్లాస్ రూం ముచ్చట్లు క ళ్ల ముందు కదిలాయి.                   
     - దమ్మయ్యగారి సంజీవరెడ్డి.
 
 ఒక్కరోజు కూడా స్కూలు మానలేదు
 స్కూల్‌కు తిప్పాపూర్ నుంచి రోజూ నడుచుకుంటూ వచ్చే వాన్ని.  అప్పుడు రోడ్డుకూడా లేదు.  ఎండా వాన లెక్క  చేయకుండా ఒక్కరోజూ స్కూలు మానలేదు.                         - దేవేందర్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement