17న సచివాలయానికి శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

17న సచివాలయానికి శంకుస్థాపన

Published Tue, Feb 16 2016 2:31 AM

17న సచివాలయానికి శంకుస్థాపన - Sakshi

♦ ఉదయం 8.23 గంటలకు ముహూర్తం
♦ తాత్కాలిక సెక్రటేరియెట్ నిర్మాణానికి అధిక మొత్తం టెండర్లకు కేబినెట్ ఆమోద ముద్ర    
 
 సాక్షి, విజయవాడ బ్యూరో:  రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని 12 శాతానికి పెంచి, టెండర్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సెస్ టెండర్లకు ఆమోదముద్ర వేసిన మరుక్షణమే శంకుస్థాపన నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 17వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. సీఎం అధ్యక్షతన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ  జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు.

► తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం. చదరపు అడుగుకు రూ.3,350 చొప్పున నిర్మాణ పనులు ఆ కంపెనీలకు అప్పగింత. 12 శాతం అదనంగా రూ.180 కోట్ల అంచనా వ్యయం రూ.201 కోట్లకు పెంపు.
► ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు భవనాల నిర్మాణం జూన్ 15లోగా పూర్తయ్యేలా చర్యలు. ఈ భవనాల నిర్మాణానికి ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటల 23 నిమిషాలకు శంకుస్థాపన.  తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాలకు రూ.60 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.25 కోట్లు మంజూరు.
► సియాచిన్‌లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం. అతడి కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం.  
► ఇబ్బందుల్లో ఉన్న 35 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో రాయితీ. ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు రిబేట్ ఇవ్వడానికి అంగీకారం. + అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిష్ట్రేషన్ చట్ట సవరణకు నిర్ణయం.+ క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.500 కంటే ఎక్కువకు కోట్ చేసిన టెండర్లన్నీ రద్దు. వీటన్నింటికీ మళ్లీ షార్ట్ టెండర్లు పిలిచి అవి ఖరారయ్యే వరకూ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి. + తూర్పుగోదావరి జిల్లా ఏటిపాక, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, అందుకవసరమైన 44 పోస్టుల మంజూరు.
►కర్నూలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు.

Advertisement
Advertisement