కేసీఆర్‌ను తప్పుబట్టిన బాబు నేడు అదే చేశారు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను తప్పుబట్టిన బాబు నేడు అదే చేశారు

Published Sun, Apr 2 2017 9:42 AM

కేసీఆర్‌ను తప్పుబట్టిన బాబు నేడు అదే చేశారు - Sakshi

అమరావతి: నలుగురికి నీతులు చెప్పడానికి ముందు ఆ వ్యక్తి నైతిక విలువలు కలిగి ఉండాలని అంటుంటారు. విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తాజాగా ఆ విలువలకు తిలోదకాలిచ్చారు. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే అంటున్నారు. న్యాయబద్ధంగా ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడకుండా పనిచేస్తున్నా తమను మంత్రి పదవుల నుంచి తొలగించినట్లు వారు వాపోతున్నారు. అవినీతి ఆరోపణలున్న వారి బెర్త్‌లు పదిలంగా ఉన్నాయని మండిపడుతున్నారు.

చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినా దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావును, పుల్లారావును, కేఈ, నారాయణను తొలగించే సాహసం చేయని చంద్రబాబు నిజాయితీగా పనిచేసినా తనపై వేటు వేస్తారా అని మాజీ మంత్రి బొజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నలుగురికి కేబినెట్‌లోకి చోటు ఇచ్చారని మండిపడుతున్నారు.

గతంలో తలసానిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అని నిలదీస్తున్నారు. అప్పట్లో గవర్నర్‌పైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా, ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 
Advertisement
Advertisement