ఐదు లక్షల్లో ఒకరికి.. | Sakshi
Sakshi News home page

ఐదు లక్షల్లో ఒకరికి..

Published Tue, Aug 6 2013 5:19 AM

One person may get these type of desease in 5 lakhs

అరుదైన వ్యాధిని గుర్తించి వెంటనే వైద్యసేవలందించి చిన్నారి ప్రాణాలను కాపాడారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం బండలింగంపల్లికి చెందిన లక్ష్మి, మల్లేష్ దంపతుల కుమారుడు హరీష్ (8) కొద్దిరోజులుగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. గొంతునుంచి ఆహారం లోపలకు వెళ్లకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యులు వ్యాధిని గుర్తించలేకపోవడంతో నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. హరీష్‌ను రెండు రోజులు ఐసీయూలో ఉంచి, వ్యాధి నయం కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పారు. కూలిపనులు చేసుకునే మల్లేష్ అంత సొమ్ము చెల్లించలేక హరీష్‌ను పదిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. 
 
 గాంధీ ఆస్పత్రి పిల్లల విభాగం వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి హరీష్ సిస్టమిక్ మయస్తీనియా వ్యాధికి గురైనట్లు గుర్తించారు. నాలుగు రోజులు వెంటిలేటర్‌పై ఉంచి ఐవీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చి అరుదైన వ్యాధిని నయం చేశారు. పూర్తిస్థాయిలో కోలుకున్న హరీష్‌ను సోమవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా యూనిట్ వైద్యులు ఉషారాణి, నాను సోము, సంతోష్‌కుమార్, రమేష్‌బాబు మాట్లాడుతూ.. సిస్టమిక్ మయస్తీనియా అరుదైన వ్యాధని, ఐదు లక్షమంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధిని గుర్తించి శస్త్రచికిత్సలు లేకుంగా నయం చేసిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పిడియాట్రిక్ హెచ్‌ఓడీ జే.వెంకటేశ్వరరావు అభినందించారు. తమ కుమారుడికి ప్రాణభిక్షపెట్టిన గాంధీ వైద్యులకు హరీష్ తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement