‘వెంకటేశ్వరా’.. ఎక్కడున్నావయ్యా! | Sakshi
Sakshi News home page

‘వెంకటేశ్వరా’.. ఎక్కడున్నావయ్యా!

Published Tue, May 8 2018 7:45 AM

Ongole dairy in deep trouble  - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  లక్షలాది మంది పాడి రైతులు.. వందల మంది ఉద్యోగులతో ఒంగోలు డెయిరీ ఆటలాడుకుంటోంది. పాలకులకు వీరి ఆకలి కేకలు వినపడటంలేదు. వ్యాపారి అయిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్‌ కావడంతో మంచి జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అసలు కథ బట్టబయలైంది. పాడి రైతులు, డెయిరీ ఉద్యోగుల బకాయిల కింద తన సొంత డబ్బులు పైసా కూడా ఇవ్వవని శిద్దా వెంకటేశ్వరరావు చేతులెత్తేశారు. బ్యాంకు రుణం కోసం డెయిరీ ఆస్తులు తాకట్టు పెడతానని.. రుణం వస్తేనే బకాయిలు చెల్లిస్తానని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు చెబితేనే డెయిరీకి వస్తానన్నారు. 

ఆర్భాట ప్రకటనలు ఎక్కడ? 
నెల రోజుల క్రితం ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీలో ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఒంగోలు డెయిరీని ఉద్ధరించడానికే తానొచ్చినట్లు ప్రకటించుకున్నారు. రూ. 20 కోట్లు తన సొంత డబ్బులు పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులకు చెల్లిస్తానన్నారు. బ్యాంకు రుణం వచ్చిన తర్వాతనే రూ. 1 ధర్మవడ్డీతో తన అప్పు తిరిగి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే పట్టుమని నెల కాక ముందే  మాట మార్చారు. తన సొంత డబ్బులు రూపాయి కూడా ఇవ్వనని స్పష్టం చేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులు మరోమారు రోడ్డెక్కారు.

రూ. 13 కోట్ల బకాయిలు 
ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ. 13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ. 2.5 కోట్లు, పీఆర్‌సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్‌ఐసీ కలిపితే మొత్తం రూ. 8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్‌ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్‌ కోసం రూ. 2 కోట్లు చెల్లించాలి. కరెంట్‌ బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారం క్రితం విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కొత్త డెయిరీ చైర్మన్‌ పైసా ఇవ్వక ఇంటికే పరిమితం కావడంతో ఇటు ఉద్యోగులు, రైతులు కలిసి మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరులను కలిశారు. డెయిరీ ఆధ్వాన పరిస్థితిపై ఏకరువు పెట్టారు. కొత్త చైర్మన్‌ వచ్చినా ఒరిగిందేమీ లేదంటూ ఆవేదన చెందారు. 

దీంతో మంత్రి శిద్దా జోక్యం చేసుకొని విద్యుత్‌ అధికారులతో మాట్లాడారు. వారం లోపు డబ్బు చెల్లించాలన్న కండిషన్‌తో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. డెయిరీ సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఏ నిమిషంలోనైనా తిరిగి విద్యుత్‌ను నిలిపివేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇంత జరుగుతున్న కొత్త చైర్మన్‌ శిద్దా వెంకటేశ్వరరావు ఏ మాత్రం స్పందించటం లేదు. రైతులు, ఉద్యోగులు కలిసే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదు. డెయిరీ ఎండీ ఫోన్‌ చేసినా చైర్మన్‌ స్పందించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగులు, రైతులు కలిసి సోమవారం డెయిరీ వద్ద ఒంగోలు–కర్నూలు ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ కోసం వీరు మంగళవారం సమావేశం కానున్నారు.

పార్టీ పరువు పోయిందట
డెయిరీ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో పాత, కొత్త చైర్మన్లకు చీవాట్లు పెట్టారు. జిల్లా అధికార పార్టీ పరువు తీశారని సీఎం మండిపడ్డారు. శిద్దా కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నంపై మరింత మండిపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బెంబేలెత్తిన కొత్త చైర్మన్‌ శిద్దా చేతులెత్తేశాడు. ఆయన చైర్మన్‌ పదవి మున్నాళ్ల ముచ్చటగానే మారింది. కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ డెయిరీని ఆదుకుంటానని ప్రకటించిన శిద్దా ఇప్పుడు మాట తప్పడంపై పాడి రైతులు, ఉద్యోగులతో పాటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మంత్రితో పోటీ?
డెయిరీ కొత్త చైర్మన్‌ శిద్దా వెంకటేశ్వరరావు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు సమీప బంధువు. ఆర్థికంగా బలవంతుడు. శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి వల్లే హంగు, ఆర్భాటం వచ్చిందని చైర్మన్‌ కుటుంబం భావిస్తోంది. దీంతో శిద్దాకు మంత్రికి పోటీగా రాజకీయంగా ఏదో ఒక పదవి సంపాదించాలన్న ఆరాటం వెంకటేశ్వరరావుకు ఉంది. ఆయన బీజేపీలోనూ పని చేశారు. దీంతో మంత్రి, చైర్మన్‌ కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు డెయిరీ రూ. 80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. డెయిరీ కంపెనీ యాక్టు పరిధిలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోవడంతో పాత చైర్మన్‌ చల్లా శ్రీనివాస్‌ చైర్మన్‌ పదవి గుదిబండగా మారింది. దీని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆయనకు పదవి కోసం ఆరాటపడే శిద్దా వెంకటేశ్వరరావు కనిపించాడు. 

దీంతో పాత చైర్మన్‌ చల్లా రాత్రికి రాత్రే తాను చైర్మన్‌గిరి నుంచి తప్పించుకొని శిద్దాను చైర్మన్‌ చేశారు. ఎట్టకేలకు పదవి పొందిన శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం పెట్టి డెయిరీని ఆదుకుంటాడనుకున్నారు. అంతేకాదు జిల్లావ్యాప్తంగా కొత్త చైర్మన్‌ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసుకున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నా.. ఒంగోలు డెయిరీ చైర్మన్‌ మార్క్‌ విషయం మంత్రి శిద్దాతో పాటు మిగిలిన నేతలకు తెలియకపోవడం గమనార్హం. అందరికీ తెలిస్తే శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్‌గా అంగీకరించరని భావించి పాత చైర్మన్‌ మొత్తం వ్యవహారాన్ని బయటకు పొక్కనియకుండా చేశారన్న ప్రచారం ఉంది. 

Advertisement
Advertisement