ఉల్లి.. పాయే! | Sakshi
Sakshi News home page

ఉల్లి.. పాయే!

Published Mon, Sep 15 2014 1:19 AM

ఉల్లి.. పాయే! - Sakshi

మంగళగిరి రూరల్
 ఉల్లిపాయలే కాదు.. ఉల్లి సాగు సైతం రైతుల కంట నీరు తెప్పిస్తోంది. దిగుబడులు ఉన్నప్పుడు ధర లేకపోవడం, ధర ఉన్నప్పుడు దిగుబడులు తగ్గిపోవడం, పంట చేతికొచే్చ సమయానికి వరుస తుపాన్లు.. ఇలా ఏటా ఏదో ఒక సమస్యతో ఉల్లి రైతులు నష్టపోతూనే ఉన్నారు. దీంతో విసుగుచెంది ఉల్లి సాగంటేనే ఉలిక్కిపడుతున్నారు.
 పెరిగిన పెట్టుబడులు నాలుగేళ్లుగా ఉల్లి సాగుతో లాభాలు రావడంలేదు. ఏ ఏటికాయేడు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తక్కువ  పట్టుబడితో సాగయ్యే కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మండలంలోని యర్రబాలెం, కృష్ణాయపాలెం, కాజ, నిడమర్రు గ్రామాలతో పాటు తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో గతేడాది 1500 నుంచి 2000 ఎకరాల్లో ఉల్లి సాగుచేశారు. ఈ ఏడాది 1000 ఎకరాల్లో కూడా సాగుచేయడంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.
 పెరిగిన పెట్టుబడులు .: ఉల్లి నాలుగు నెలల పంట. నాలుగు కిలోల విత్తనాల కొనుగోలుకు ఆరు వేల రూపాయలు, నారు పెంచినందుకు మరో నాలుగు వేల రూపాయలు, నాటు వేసిన కూలీలకు ఐదు వేల రూపాయలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు రూ.20 వేలు, కౌలు రూ.15 వేలు, ఉల్లి పీకుడు, కోత కూలికి రూ.10 వేలు.. ఇలా మొత్తం కలుపుకొని ఉల్లిపంట సాగుకు ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకూ పెట్టుబడులవుతున్నాయి.
 ఆరుగాలం శ్రమించినా ప్రయోజనమేది?
 ఉల్లి బాగా పండితే ఎకరానికి 150 నుంచి 200 టిక్కీల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దిగుబడులు వచ్చే సమయానికి ఉల్లి ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. నాలుగేళ్లుగా సరాసరి టిక్కీ ఉల్లిపాయల ధర రూ.300 నుంచి 350 మాత్రమే పలికింది. ఈ లెక్కన రైతులకు రూ.45 వేల నుంచి రూ.70 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. ఆరుగాలం శ్రమించినా అన్నదాతకు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.
 కూరగాయల సాగుకు మొగ్గు.: గడచిన నాలుగు సంవత్సరాలుగా వరుస తుపాన్ల కారణంగా ఉల్లిపంట నీట మునిగి దెబ్బతింది. రైతులకు చిల్లిగవ్వ మిగల్లేదు. దీంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో రైతులు ఉల్లిపంట సాగు చేసేందుకు ముందుకు రావడంలేదు. ప్రత్యామ్నాయంగా బీర, కాకర, వంగ, గోరు చిక్కుడు పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు రైతులు మాత్రం ఉల్లిపంటపై మమకారంతో విస్తీర్ణాన్ని తగ్గించుకుని సాగు చేస్తున్నారు.
 
 ఉల్లినే నమ్ముకున్నా..
 ఏటా మూడెకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నా. నాలుగేళ్లుగా దానినే నమ్ముకున్నా పెట్టుబడులు కూడా రాలే దు. ఈ ఏడాది ఎకరం విస్తీర్ణంలోనే ఉల్లి వేశా. పెట్టుబడులు పెరగడం, పంట చేతికి వచ్చే సమయంలో ధర లేకపోవడంతో ఉల్లి సాగుకు రైతులు ముందుకు రావడం లేదు.
 - గుండాల తిరుపతయ్య,
 కౌలు రైతు, యర్రబాలెం
 
 మమకారం చంపుకోలేకే..
 నాలుగేళ్లుగా ఉల్లిపంట వేసి నష్టపోతూనే ఉన్నా. అయినా దానిపై మమకారాన్ని చంపుకోలేక తక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నా. ఏటా రెండెకరాలు సాగు చేస్తుండగా ఈ ఏడాది 70 సెంట్లలో మాత్రమే ఉల్లిపంట వేశా. నష్టాలు కొనసాగితే భవిష్యత్తులో ఉల్లి సాగు చేసేవారే ఉండరు.
 - పలగాని వెంకటేశ్వరరావు,
 రైతు, యర్రబాలెం


 
 

Advertisement
Advertisement