Sakshi News home page

ఆన్‌లైన్.. స్లోడౌన్

Published Fri, Dec 20 2013 3:54 AM

Online .. Slowdown

పంచాయతీ సిబ్బంది అవగాహన లోపం.. అలసత్వం.. గ్రామాల అభివృద్ధికి శాపంగా మారింది. పంచాయతీల పరిధిలో అన్ని విభాగాలకు చెందిన వివరాలను ఆన్‌లైన్ చేయకుండా వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. ప్రగతి పనుల్లో పారదర్శకత లోపించే అవకాశం ఏర్పడింది.
 
 పాలమూరు, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. అయితే జిల్లాలో ఇవి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం వివరాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నింటినీ కంప్యూటరీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసినా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఈ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం.
 
  జిల్లాలో 1279 మైనర్, 48 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమాచారాన్ని పొందుపర్చడంలో సంబంధిత విభాగాలు వెనుకబడి పోయాయి. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కోట్లాది రూపాయాల నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కానరావడం లేదు. నిధులు పక్కదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. పాలకవర్గం పదవీ కాలం 2011 అగస్టులో ముగియడంతో 13వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి.
 
 గత నెలలో 2011-12కు సంబంధించిన 13వ ఆర్థిక సంఘం (టీఎఫ్‌సీ) నిధులు ఈ మధ్యే విడుదలయ్యాయి. ఇక నుంచి నిధులు విడుదల కావాలంటే పంచాయతీ పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. అయతే పంచాయతీల్లో కంప్యూటర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే పంచాయతీ గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
 కారణాలెన్నో..?
 జిల్లాలో1327 పంచాయతీలుండగా దాదాపు 169 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీలున్నాయి. ఒక్కో కార్యదర్శికి నాలుగు నుంచి ఐదారు పంచాయతీల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల వినియోగం తదితర వాటిని ఆన్‌లైన్‌ల్‌లో ఉంచేందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి సరైన అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో కంప్యూటర్లు లేకపోవడంతో వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర, సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహనా రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో పొందుపరచకుండానే అయిందనిపిస్తున్నారు. గడువు ముగిసి ఆరునెలలు గడుస్తున్నా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీల వివరాలు ఆన్‌లైన్ చేయని వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాాశం లేదు. అదే జరిగితే పంచాయతీల అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. కాగా దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement