ఓటు చుట్టూ రక్షణ చట్రం | Sakshi
Sakshi News home page

ఓటు చుట్టూ రక్షణ చట్రం

Published Tue, Mar 12 2019 1:09 PM

Only Four Days For Vote Registration - Sakshi

ఉదయం నిద్ర లేవగానే...ఓటరు జాబితాలో మన పేరుందో లేదో    చూసుకుని హమ్మయ్య అనుకోవాలి!మధ్యాహ్నం భోజనం పూర్తికాగానే...మరోసారి తనిఖీ చేసుకుని నిశ్చింతగా పని చేసుకోవాలి!రాత్రి నిద్రపోయే ముందు...ఎందుకైనా మంచిదని   పరిశీలించుకుని భరోసా చెప్పుకోవాలి!

సాక్షి, అమరావతి :...ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతున్న జోక్‌ ఇది. ఇందులో కొంత హాస్యమున్నా వాస్తవ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా... ‘మా ఓటు భద్రమేనా?’ అనే మాటే వస్తోంది. ఏ నలుగురు జమ కూడినా చర్చంతా ‘ఓటు’పైనే సాగుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం... రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం. పెద్దఎత్తున ఓటర్లను అక్రమంగా తొలగించే ఉద్దేశంతో, ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకంగా సర్కారే ‘ఐటీ గ్రిడ్స్‌’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించడం...! ఈ నేపథ్యంలో ప్రజల ఆధార్‌ కార్డ్, బ్యాంకు ఖాతాలు, ఓటరు నంబరు, ఇతర వ్యక్తిగత వివరాలన్నీ వ్యక్తిగత గోప్యత నిబంధనలకు వ్యతిరేకంగా ఆ ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ‘ఐటీ గ్రిడ్స్‌’ సంస్థ ఓ యాప్‌ తయారుచేసి తమ సిబ్బందితో నకిలీ సర్వేలు చేయించింది. ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నవారు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను మూకుమ్మడిగా తొలగించేందుకు పూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పుడే మేల్కోండి...
అసలు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదోనన్న సందేహం అందరిలో సహజంగానే నెలకొంది. ఎన్నికల రోజు పోలింగ్‌ బూత్‌ దగ్గరకు వెళ్లి ‘అయ్యో ఓటు లేదే’ అని బాధ పడేకంటే... ఇప్పుడే ఓసారి సరిచూసుకోవడం ఉత్తమం. ఎలాగూ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలన్నీ నియోజకవర్గాల వారీగా ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. ప్రజలు తమ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక

ఏర్పాట్లు చేస్తుంది. మన వంతుగా ఏం చేయాలంటే...
స్థానిక అధికారులను సంప్రదించిప్రతి గ్రామంలో, పట్టణాల్లో డివిజన్లలో ఇద్దరు పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులు ఉంటారు. వారి వద్దకు వెళ్లి ఓటరు జాబితానులో పేరును  సరి చూసుకోవచ్చు. పేరు, ఇంటి నంబర్‌ తదితర వివరాలు ఇస్తే వారే పరిశీలించి చెబుతారు. మండల స్థాయిలో అయితే తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల విభాగం ఉంటుంది. మీ వివరాలు చెబితే తనిఖీ చేస్తారు. జిల్లా కలెక్టరేట్‌లోనూ ఎన్నికల విభాగం ఉంటుంది. అక్కడ అధికారులకు మీ వివరాలు తెలిపి ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవచ్చు.  

టోల్‌ ఫ్రీ నంబర్‌1950కు డయల్‌ చేసి..
ఓటర్ల సౌలభ్యం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. 1950 నంబర్‌కు ఫోన్‌ చేసి మీ పేరు, వివరాలు గాని, ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్‌ నంబర్‌ గాని చెబితే ఓటు ఉందో లేదో స్పష్టం చేస్తారు.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా...
ఇది మరింత తేలికైన పద్ధతి. కేవలం ఒక ఎస్‌ఎంఎస్‌ పంపించి ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఓటరు కార్డు నంబర్‌ను 1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీ ఓటు వివరాలతో తిరిగి సమాధానం ఇస్తారు.

 వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు...
‘నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌’ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా  అందుబాటులో ఉంచింది. గూగుల్‌లో ఈ పోర్టల్‌ను ఓపెన్‌ చేసి అందులో మీ పేరు, వివరాలు గాని, మీ ఓటరు ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్‌ నంబర్‌ను గాని ఎంటర్‌ చేస్తే వెంటనే సమాచారం లభిస్తుంది. మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది. అలాగే ‘నో యువర్‌ ఓట్‌’ పేరుతో వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి మీ పేరు, వివరాలు, ఓటరు ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది.

ఫాం 6తోకొత్తగా నమోదు కోసం... 
ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ఇప్పుడు మరో 4 రోజుల వరకు పేరు నమోదుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ‘ఫాం 6’ను ప్రత్యేకంగా రూపొందించింది. దీని ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే ‘ఏపీ సీఈవో’ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి మీ జిల్లా, నియెజకవర్గాన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత ఫాం 6 అప్లికేషన్‌ను ఎంపిక  చేసుకోవాలి. అందులో పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాలి. పుట్టిన తేదీ, వయసు, ఇంటి అడ్రస్‌ ఆధారాలు తెలిపే గుర్తింపు కార్డులను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఆధార్‌ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌ కార్డు, పాస్‌ పోర్టు, ఇంటి పన్ను రసీదు, వంట గ్యాస్‌ బిల్లు రసీదు మొదలైన గుర్తింపు కార్డులలో ఏవైనా రెండు అప్‌లోడ్‌ చేయాలి. ఇలా దరఖాస్తు సమర్పిస్తే వారం, పది రోజుల్లో సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదించి గుర్తింపు కార్డులను పరిశీలించి ఓటరు కార్డు జారీ చేస్తారు.  

ఫాం7అంటే...
ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపునకు... ఫాం 7ను రెండు ప్రయోజనాల కోసం రూపొందించారు.  
1) ఎవరైనా తమకు తాముగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించుకోవాలని భావిస్తే...  
2) ఓటరు జాబితాలో అనర్హులు ఉన్నారని భావిస్తే...
ఈ రెండు సందర్భాల్లో ఫాం 7 ద్వారా ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించవచ్చు.  
ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలోనే ఓటరుగా ఉండాలి. వేరేచోట ఓటరుగా నమోదు చేసుకోవాలని భావిస్తే... ప్రస్తుతం ఓటరుగా ఉన్నచోటు నుంచి పేరు తొలగించుకోవాలి. తనను ఓటరుగా తొలగించమని ఫాం 7 ద్వారా కోరాలి. ఆన్‌లైన్‌లో దీని ద్వారా దరఖాస్తు చేయాలి. అనంతరం అధికారులు మిమ్మల్ని సంప్రదించి, నిర్ధారించుకున్న అనంతరం ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారు.
అదే విధంగా ఒక నియోజకవర్గం ఓటరు జాబితాలో అనర్హులు ఉన్నారని ఎవరైనా భావిస్తే అలాంటి వారిని తొలగించమని అధికారులను కోరవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్లో ఫాం 7ను భర్తీ చేసి దరఖాస్తు చేయాలి. లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగాలు ఉంటాయి. అక్కడకు వెళ్లి అనర్హుల పేర్లను తొలగించమని ఫాం7 ద్వారా కోరవచ్చు.  
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసినా, నేరుగా దరఖాస్తులు సమర్పించినా వాటిపై అధికారులు స్పందించి విచారణ నిర్వహిస్తారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులిచ్చి వాస్తవాలను నిర్ధారిస్తారు. అనర్హులున్నారని నిర్ధారణ అయితేనే జాబితా నుంచి తొలగిస్తారు.

Advertisement
Advertisement