Sakshi News home page

మావోయిస్టులపై విమర్శలు చేసిన ఏకైక నేత

Published Tue, Oct 27 2015 12:33 AM

మావోయిస్టులపై విమర్శలు చేసిన ఏకైక నేత - Sakshi

కొయ్యూరు: గన్‌మేన్లు వద్దని ప్రభుత్వానికి లేఖ రాసిన  మొదటి ఎమ్మెల్యే  దేముడే..నిజాయతీకి ఆయన మారుపేరు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. రెండుసార్లు  ఎమ్మెల్యేగా వ్యవహరించినా సంపాదించింది ఏమి లేదు. సామాన్యుడిలా పెంకుటింటిలోనే నివసించారు. భార్య చెల్లయ్యమ్మ శరభన్నపాలెంకు కిలోమీటరు దూరంలో ఉన్న కంపరేగులలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె జీతంతోనే ఇల్లు గడిచింది. వచ్చే పెన్షన్‌తోనే మన్య మంతటా తిరిగారు. గిరిజన సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం సాగించారు. ఏ పార్టీ నేతలైనా అవసరమైతే పోలీసులపై  ఆరోపణలు చేస్తారు తప్ప మావోయిస్టులపై ఎలాంటి ప్రకటనలు చేయరు.

దేముడు అలా కాదు. చేసింది తప్పు అనిపిస్తే మావోయిస్టులయినా సరే విమర్శలు గుప్పించేవారు. చేస్తున్నది తప్పని కచ్చితంగా ఎత్తి చూపేవారు. ఇటు పోలీసుల చర్యలను కూడా ఆయన అదే విధంగా తప్పుబట్టేవారు. ఇటీవల కేజీహెచ్‌లో చికిత్స పొందుతూనే కొయ్యూరు విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. మావోయిస్టులు ముగ్గురు సాధారణ గిరిజనులను కిడ్నాప్ చేయడాన్ని ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో పోలీసులు బలపంలో గిరిజనులను పట్టుకుని ఓడిశాలో బీఎస్‌ఎఫ్ బలగాలకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. సాగుల సంఘటనప్పుడు మావోయిస్టులు చేసింది తప్పని బహిరంగంగా విమర్శించారు.

ప్రాణం పోసిన రాజశేఖరరెడ్డి
2009లో దేముడు ఆరోగ్యం క్షీణిస్తే ఆయనను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. ఆరోగ్యం మరింత క్షణించడంతో అతనిని వెంటనే విమానంలో హైదరాబాద్ తీసుకు వచ్చి నిమ్స్‌లో చేర్చి అప్పట్లో ప్రాణం కాపాడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖరరెడ్డికి దక్కుతుంది. అప్పట్లో దేముడు గుండెకు రంధ్రం పడడంతో స్టంట్ వేశారు. తరువాత దేముడు ఆరోగ్యం కుదుటపడింది. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత నెలలో కేజీహెచ్‌లో చేరారు.
 
 

Advertisement
Advertisement