‘ఇంటి’ దొంగల మాటేంటి..? | Sakshi
Sakshi News home page

‘ఇంటి’ దొంగల మాటేంటి..?

Published Fri, May 1 2015 4:46 PM

‘ఇంటి’ దొంగల మాటేంటి..?

ప్రభుత్వ నిర్వాకంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోన్న వైనం
స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న అధికారులపై చర్యలకు వెనుకంజ..!
అక్రమాధికారులను కీలకస్థానాల్లో నియమించడంలో ఆంతర్యమేంటో?


హైదరాబాద్: ప్రభుత్వం ‘ఇంటి’దొంగల ఆట కట్టించాల్సింది పోయి.. అందలమెక్కిస్తుండటంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోంది. తమిళ కూలీలు 20 మందిని ఎన్‌కౌంటర్ చేసినా.. 1100 మందికిపైగా అరెస్టు చేసినా.. 40 మంది స్మగర్లను పీడీ చట్టం కింద అరెస్టు చేసినట్టు ప్రకటించినా.. స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న అటు పోలీసు.. ఇటు అటవీ శాఖల్లోని ఇంటిదొంగలను ప్రభుత్వం విస్మరిస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ పోలీసు విచారణలో ఇంటిదొంగల విషయాన్ని వెల్లడించినట్టు తెలిసింది.

నల్లమల అటవీ ప్రాంతంలో చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, పాలకొండ అడవుల్లో 5.50 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1995లో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం విధించడంతో.. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అటవీ, పోలీసు శాఖల్లోని కొందరు అక్రమాధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపారు. ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. గత రెండు దశాబ్దాల్లో 40 వేల టన్నులకుపైగా సరిహద్దులు దాటినట్లు ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.     
    
ఒక్కరిపై వేటుతో సరి..
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి, విచారించారు. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ‘ఎర్ర’ స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న ఎనిమిది మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 24 మంది ఎసై్సలపై కఠినచర్యలు తీసుకోవాలని జూలై, 2014లో అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆరుగురు డీఎఫ్‌వోలు సహా 54 మంది అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

పోలీసు, అటవీ శాఖ అధికారులకు స్మగ్లర్లు కట్టించిన భవనాలు, ఇచ్చిన నజరానాల వివరాలనూ ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌పై వేటు వేసి చేతులు దులుపుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.

కీలక స్థానాల్లో అక్రమార్కులు..
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎర్రఇం‘ధనం’ సమకూర్చడం.. నెలసరి మామూళ్లు ముట్టజెపుతుండటం వల్లే అధికార పార్టీ నేతలు స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తోన్న పోలీసు, అటవీ శాఖ అధికారులను కీలక స్థానాల్లో నియమించేలా టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగడానికి దారితీస్తోంది. ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించిన ప్రాంతాల్లో స్మగ్లర్లకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న అధికారులను నియమించేలా అటవీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.

ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే మార్గాల్లోనూ స్మగర్లకు సహకరించే పోలీసు అధికారులను నియమింపజేసుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ విచారణలో ఇదే అంశాన్ని అంగీకరించినట్లు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ కీలకాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. తాము ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వాహనాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఓ డీఎస్పీ పైలట్‌గా తన వాహనాన్ని పంపేవారని సౌందర్యరాజన్ విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

Advertisement
Advertisement