అధికార పార్టీ దౌర్జన్యకాండ | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ దౌర్జన్యకాండ

Published Sun, Apr 12 2015 2:51 AM

Outraged by the ruling party stem

జిల్లాలో మితిమీరిన టీడీపీ ఆగడాలు
ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే ఎదురు దాడి
అధికారులను అడ్డుపెట్టి దిగజారుడు రాజకీయాలు
శాసనసభ్యులపై కూడా తప్పుడు  కేసులు
నిన్న సునీల్‌కుమార్, నేడు రోజా

 
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికారపార్టీ ఆగడాలు శ్రుతి మించాయి. ప్రతిపక్షపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు  ప్రజాసమస్యలను ప్రస్తావించకుండా అధికార పార్టీనేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాదూ కూడదని ప్రజలపక్షాన పోరాడితే అధికారులను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శాసనసభ్యులని కూడా చూడకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఆర్కే రోజాపై అధికార పార్టీ కక్షగట్టి దాడులకు దిగడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
సాక్షి, చిత్తూరు : నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికారపార్టీ దౌర్జన్యకాండ మితిమీరింది. రోజా చేతిలో ఓటమి చెందిన అధికారపార్టీనేత ముద్దుకృష్ణమనాయుడు అధికారులను అడ్డుపెట్టుకుని అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ప్రజలపక్షాన రోజా పోరాడడం జీర్ణించుకోలేని  తెలుగు తముళ్లు ఆమెపై దౌర్జన్యం చేయడమే కాక నిస్సిగ్గుగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదినెలల కాలంలో ఆమెపై అధికారపార్టీ నేతలు రెండుసార్లు దాడులకు పాల్పడడమే కాక రెండు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టించారు.

సెప్టంబర్ నెలలో  నగిరిలో జరిగిన  జాతరలో  అమ్మవారికి  హారతి ఇచ్చేందుకు  వెళ్లిన ఎమ్మెల్యేపై  అధికారపార్టీ కార్యకర్తలు స్వయంగా దాడికి  దిగి హారతి పళ్లెం  విసిరికొట్టి ఆమెను గాయపరచడమే కాకుండా ఎస్సీ యాక్ట్ కేసుపెట్టించారు. తాజాగా శుక్రవారం అర్హులైన వారికి పింఛన్లు ఎందుకు ఇవ్వరంటూ పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా అధికారులను అడిగేందుకు వచ్చిన  రోజాను అధికారపార్టీ నేతలు పోలీసుల అండతో అడ్డకోవడమే కాకుండా ఆమెపై  మరోమారు ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ మహిళా ప్రజాప్రతినిధిపై అధికార పార్టీ కక్షగట్టి దాడులకు దిగడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొన్నటికి మొన్న పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ పై  తప్పుడు కేసు పెట్టించారు. గత ఏడాది నవంబర్ మూడవ తేదీన యాదమరి మండలం మోర్దాన్‌పల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్ గతంలో పని చేసిన వారిని విధుల నుంచి ఎందుకు తొగించారని ప్రశ్నించినందుకు అధికారపార్టీ నేతలు ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. అధికారపార్టీ నేతల ఆగడాలను  నియోజకవర్గ ప్రజలేకాక జిల్లా వ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రజల సంగతి దేవుడెరుగు ఏకంగా శాసనసభ్యులకే  ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేకుండా పోవడం విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా  వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులపై అధికారపార్టీ దౌర్జన్యకాండ మితిమీరింది. వందలకొద్ది అక్రమ కేసులు పెట్టించి కార్యకర్తలను  భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  జిల్లాలో అధికారపార్టీ ఒత్తిళ్లు భరించలేకున్నామని  ఓ పోలీసు అధికారే పేర్కొనడం చూస్తే పరిస్థితికి అద్దం పడుతుంది.
 
రోజాకు స్విమ్స్‌లో వైద్య సేవలు
తిరుపతి కార్పొరేషన్ : నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తీవ్ర అస్వస్థతకు గురై తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, రోజాపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టాలని పోలీసులపై టీడీపీ నాయకుల వత్తిడి చేయడంపై రోజా పుత్తూరులో శనివారం ధర్నా చే శారు. సీఐ సాయినాథ్ దురుసు ప్రవర్తనపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆందోళన చేశారు. ఈనేపథ్యంలో తీవ్ర మండుటెండలో నిరసన చేస్తున్న రోజాకు షుగర్ లెవల్స్ పడిపోవడం, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది.

దీంతో ఆమెను ముందుగా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈనేపథ్యంలో స్విమ్స్ క్యాజువాలిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్ నేతృత్వంలో రోజాకు వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.

స్విమ్స్‌లో రోజాను పరామర్శించిన నాయకులు
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న రోజాను పరామర్శించారు.

Advertisement
Advertisement