వేతన వెతలు | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Published Fri, Nov 15 2013 1:47 AM

Outsourcing employees salary delay

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నెలంతా పనిచేసిన వేతన జీవికి మొదటి వారంలో జీతం చేతిలో పడకుంటే ఎన్నో ఇబ్బందులు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, పాలు, కిరాణా... ఇలా ఒక్కటేమిటి.. అన్ని దిక్కుల నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి.  వారం.. పది రోజులంటే ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ నెలల తరబడి అంటే.. కష్టమే. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈ కష్టం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏకంగా మూడు నెలల నుంచి వారికి జీతాల్లేవు. నెలంతా పనిచేయడం ఒక ఎత్తయితే జీతం కోసం కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగడం మరో ఎత్తవుతోంది. దాదాపు రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది.
 
 ప్రభుత్వం సకాలంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన నిధులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు సర్కారు నుంచి కమీషన్ పుచ్చుకునే ఏజెన్సీ సైతం ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే వేతనాలిస్తామని తెగేసి చెప్పడంతో ప్రతినెలా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో దాదాపు 110మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, పారామెడికల్, కంప్యూటర్ ఆపరేటర్, హౌస్‌కీపింగ్ తదితర కేటగిరీల్లో వీరంతా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వీరంతా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన వేతన నిధులు సదరు ఏజెన్సీకి విడుదల చేస్తుంది. దీంతో ఏజెన్సీ ఆయా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. అయితే నిధుల విడుదలలో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో వీరికి నెలవారీగా వేతనాలు అందడం కష్టంగా మారింది.
 
 మూడు నెలలుగా అందని వేతనాలు
 వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు నెల వరకు వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయా ఉద్యోగులు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థే సిబ్బందికి నెలవారీ వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ సదరు సంస్థ వేతనాలు మాత్రం తప్పక చె ల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రభుత్వం ఏజెన్సీకి 3శాతం కమీషన్ చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనలను ఏజెన్సీ విస్మరిస్తోంది. నెలవారీగా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందిన తర్వాతే వేతనాలిస్తామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో ఇటీవల కొందరు ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా త్వరలోనే వేతన నిధులు విడుదలవుతాయని జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ హన్మంతరావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement
Advertisement