మాగోడు వినండయ్యా.. | Sakshi
Sakshi News home page

మాగోడు వినండయ్యా..

Published Wed, Apr 29 2015 5:39 AM

PAC Chairman of the rehabilitation colonies bhuma tour

పునరావాస కాలనీల్లో పీఏసీ చైర్మన్ భూమా పర్యటన
సమస్యలు ఏకరువు పెట్టిన కాలనీవాసులు

 
ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మంగళవారం కృష్ణపట్నం పోర్టు పునరావాస కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల కోసం ఏర్పాటైన సీవీఆర్ ఆసుపత్రి(మాధవ చికిత్సాలయం)ని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్వో ప్లాంటును పరిశీలించారు. మండుటెండలో పాదయాత్ర ద్వారా కాలనీలో నిర్మించిన రోడ్లు, ఇరువైపులా నాటిన చెట్లు, డ్రెయిన్లు, ఆలయాలను తిలకించారు. మధురానగర్‌లో సీవీఆర్  పాఠశాలను పరిశీలించారు.  

సమస్యలను విన్నవించిన నజిరీనా
పునరావాస కాలనీలోని పాదర్తిపాళేనికి చెందిన నజిరీనా అనే మహిళ పలు సమస్యలను భూమా నాగిరెడ్డికి విన్నవించింది. ఆమెతోపాటు ఆ ప్రాంతవాసులు తమ గోడును వెల్లిబుచ్చారు. ఉప్పు సాగు నిలిచిపోవడంతో ఉపాధి దొరక్క బతుకు భారంగా మారిందన్నారు. ప్రాజెక్టుల నుంచి కొందరు పెద్దలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలిపారు.  కృష్ణపట్నం గ్రామంలో జెన్‌కో ప్రాజెక్టు అందజేస్తున్న ప్యాకేజీని ఇతర ప్రాజెక్టుల నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ గ్రామాల కాపులు ఈ సందర్భంగా పలు సమస్యలు, డిమాండ్లను భూమా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం నిర్వాసితులకు అంద వలసిన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామని భూమా హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి ఉన్నారు.

Advertisement
Advertisement