పచ్చపాతం సామాజిక భద్రత పింఛన్లలో కోత | Sakshi
Sakshi News home page

పచ్చపాతం సామాజిక భద్రత పింఛన్లలో కోత

Published Fri, Sep 26 2014 11:59 PM

పచ్చపాతం సామాజిక భద్రత పింఛన్లలో కోత

నిరుద్యోగ భృతి అన్నాడు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాడు. రైతుల పట్ల తన పంథా మారిందన్నాడు.. రుణమాఫీకి మెలిక పెట్టాడు. ఇంటికి పెద్దకొడుకన్నాడు.. పండుటాకులు, నిర్భాగ్యుల ఆసరాతో ఆడుకుంటున్నాడు. ఒకటో తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. పింఛన్ అర్హుల జాబితాలో ఎవరి పేరుంటుందో.. ‘పచ్చ' సర్వే ఎవరి పాలిట శాపమవుతుందోననే
 చర్చ లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలన గత తొమ్మిదేళ్ల ఆయన పాలనను కళ్లకు కడుతోందనే చర్చకు తావిస్తోంది.
 
 కర్నూలు(అగ్రికల్చర్): సామాజిక భద్రత పింఛన్ల సర్వే వేలాది మంది లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. పింఛన్లకు పంపిణీ చేస్తున్న మొత్తం పెంచుతున్న తరుణంలో.. వెరిఫికేషన్ పేరిట కోతకు తెరతీయడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించక.. పార్టీలపరంగా లబ్ధిదారుల తొలగింపునకు శ్రీకారం చుట్టడం తెలుగుదేశం పార్టీ ‘పచ్చ'పాత ధోరణికి అద్దం పడుతోంది. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో 32 మంది వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయుల పింఛన్ల తొలగింపే ఇందుకు నిదర్శనం. ఇకపోతే కమిటీ బాధ్యతలు తమకే అప్పగించాలని తమ్ముళ్లు పట్టుబట్టడంతో 105 పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో వెరిఫికేషన్ నిలిచిపోయింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లోని 1,04,099 మంది లబ్ధిదారులు అక్టోబర్ నెలలో పింఛన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వెరిఫికేషన్ పూర్తయితేనే పింఛన్‌కు అర్హత లభించనుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరడంతో ఒక్క పింఛన్ కూడా వెరిఫికేషన్‌కు నోచుకోలేదు. కమిటీలో అంతా తమ వాళ్లే ఉండాలని పట్టుబట్టడమే ఇందుకు కారణమవుతోంది. అధికారులు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీలు వేసినా.. దేశం నేతలు అంగీకారం తెలుపకపోవడం గందరగోళానికి తావిస్తోంది. డోన్ మునిసిపాలిటీలోని 8 వార్డులు, ఉయ్యాలవాడ మండలంలోని ఒక పంచాయతీ, రుద్రవరం మండలంలోని ఏడు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం పింఛన్లు 3,25,965 ఉన్నాయి. వీటి వెరిఫికేషన్‌కు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,085 కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే 980 పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో మాత్రమే 2,21,866 పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయింది. ఇందులో 13,178 పింఛన్లను తొలగించారు. అనర్హుల్లో అధిక శాతం వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్లకు పంపిణీ చేస్తున్న మొత్తం పెంచుతుండటంతో.. ఆ భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం వెరిఫికేషన్ పేరిట అడ్డగోలుగా కోత కోస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వే పూర్తయిన పింఛన్లకు సంబంధించిన డేటా ఎంట్రీ జిల్లా కేంద్రంలో చురుగ్గా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1,65,603 పింఛన్ల డేటా ఎంట్రీ పూర్తయింది. ఇందులో 9,254 పింఛన్లను అనర్హమైనవిగా తొలగించారు. అర్హత పొందిన వాటిలో 25,514 పింఛన్లకు ఆధార్ కార్డులు లేవని గుర్తించారు. వీటికి బడ్జెట్ విడుదలవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకం.

 

నిరుద్యోగ భృతి, పింఛన్, సామాజిక భద్రత, Unemployment allowance, pension, Social Security
 

Advertisement
Advertisement