అమెరికాలో పాలమూరు యువకుని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అమెరికాలో పాలమూరు యువకుని ఆత్మహత్య

Published Fri, Feb 7 2014 3:18 AM

అమెరికాలో పాలమూరు యువకుని ఆత్మహత్య - Sakshi

బాలానగర్ , న్యూస్‌లైన్: ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు  ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన వాడ్యాల అరవింద్‌రెడ్డి (25) ప్రాథమిక విద్యను షాద్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశాడు. అక్కడి విజ్ఞాన్ కళాశాలలోనే ఇంటర్ చదివాడు. మహబూబ్‌నగర్‌లోని జేపీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేసి 2011 ఫిబ్రవరి 14న ఎంఎస్ కోర్సుకోసం అమెరికాలోని కాలిఫోర్నియా, సంజూస్ పట్టణంలోని యూనివర్సిటీకి వెళ్లాడు.

అక్కడే కోర్సు చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమై డబ్బులకోసం తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. వారం కిందటే కళాశాల ఫీజు కోసం తండ్రి ద్వారా రూ.లక్ష తెప్పించుకున్నాడు. ఒకవైపు సోదరి వివాహానికి సిద్ధంగా ఉండటం, మరోవైపు తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపానికిగురై బుధవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు వేసుకుని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మృతుని మిత్రుడు తెలుసుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. ప్రస్తుతం మృతదేహం పోలీసుల అధీనంలో ఉంది.

తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
 తమ కుమారుడు  మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు శ్రీధర్‌రెడ్డి, వాసుదేవి, సోదరి అఖిల ఒక్కసారి గా కుప్పకూలి పోయారు. సంఘటన గురించి తెలుసుకునేందుకు నానాపాట్లు పడ్డారు. తెలిసిన వారందరితో ఫోన్ ద్వారా సమాచార సేకరణకు యత్నించారు. ముందుగా విషయాన్ని జేపీఎన్‌సీఈ చైర్మన్ కె.ఎస్.రవికుమార్‌కు తెలియజేయగా ఆయన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి సమాచారమిచ్చారు. మంత్రి తానా అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్‌తో ఫోన్లో మాట్లాడగా చివరకు గురువారం రాత్రి 8 గంటలకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement
Advertisement