సంక్షోభంలో పలాస జీడి పరిశ్రమలు | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో పలాస జీడి పరిశ్రమలు

Published Sun, May 17 2015 4:20 PM

సంక్షోభంలో పలాస జీడి పరిశ్రమలు

సాక్షి, పలాస: జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పరిశ్రమలు నేడు సంక్షోభంలో పడ్డాయి. వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారి సమ్మెతో జీడి పరిశ్రమ లు పూర్తిగా మూతపడ్డాయి. ఉగాది నుంచి కొత్త జీడిపప్పు ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఓ పక్క ముడిసరుకు కొరత, మరోపక్క కార్మికుల ఆందోళన, రాష్ట్ర విడిపోవడం తదితర కారణాల వల్ల ఒకప్పుడు కళకళలాడిన జీడి పరిశ్రమ నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజులుగా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి.

జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల జీడిగింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పంట, పరిశ్రమలే ఉద్దానం ప్రజల జీవనాధారం.

పంట ఇలా వచ్చింది...
16వ శతాబ్దంలో తీరప్రాంతం కోతకు గురి కాకుండా పోర్చుగీసు వారు జీడి మొక్కలు నాటడం ప్రారంభించారు. వీటి నుంచి వచ్చే జీడిగింజలు మొదట్లో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఉండేవి. తరువాత కాలంలో ఇక్కడి ప్రజలు జీడిగింజలను కాల్చి అందులోని పప్పును తినడం ప్రారంభించారు. సుమారు 7 దశాబ్దాల క్రితం జీడి పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. 1945 నుంచి పలాస కేంద్రంగా జీడిపిక్కల కొనుగోలు ప్రారంభమైంది. అప్పటి వరకు ఇక్కడ రైతులకు వాటి విలువేంటో తెలియలేదు.

రాష్ట్రంలో జీడి ఉత్పత్తికి కేంద్రమైన మోరి ప్రాంతం నుంచి వ్యాపారులు పలాసకు వచ్చి జీడిగింజల కొనుగోలు చేపట్టారు. ఆ తరువాత వేటపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారి రాధాకృష్ణ పలాసలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పటికే పలాసకు చెందిన మల్లా జనార్దన అనే వ్యాపారి పెన ంపై జీడి గింజలను కాల్చి పప్పు తీసి మార్కెట్‌లో విక్రయించేవారు. ఆ విధంగా ప్రారంభమైన జీడి పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగింది. 1986 నాటికి రోస్టింగ్ విధానంతో నడిచే 30 పరిశ్రమలు ఉండగా, నేడు వాటి సంఖ్య పలాసతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 250కి పెరిగింది. ఇక్కడ తయారైన జీడిపప్పును దేశంలోని  ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

ముడిసరుకు కొరత
జీడి పరిశ్రమలకు అవసరమైనంత ముడిసరుకు స్థానికంగా అందడంలేదు. ఏడాదికి 10.80 లక్షల టన్నుల జీడి గింజలు అవసరం కాగా అంత దిగుబడి లేకపోవడంతో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన 35 దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 22 కిలోల జీడిపప్పు దిగుబడి వచ్చే 80 కిలోల జీడిగింజల బస్తా ప్రస్తుతం మార్కెట్‌లో రూ.7,200 పలుకుతోంది. గ్రేడింగ్‌ను బట్టి పలాసలో 16 రకాల జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది. ఈ పరిశ్రమ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ పరిశ్రమలు, కార్మికుల స్థితిగతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

విజయవాడ దాటి హైదరాబాదు వెళ్లాలంటే పన్ను పోటు పెరిగింది. అలాగే తిరుపతి, ఇతర దేవస్థానాలు పలాస జీడిపప్పు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రముఖ దేవస్థానాలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి పప్పు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడి పరిశ్రమలకు రాయితీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు, కనీస వేతనాలు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా యాజమాన్యాలు, కార్మికుల మధ్య వేతన ఒప్పందాల విషయంలో ప్రతిసారీ వివాదాలు తలెత్తి పరిశ్రమలు మూత పడుతున్నాయి.

ముడిసరుకు అందడం లేదు
పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు అందడం లేదు. దిగుబడి తగ్గిపోయింది. ఈసరికే జీడి పంట రైతుల చేతికి అందాల్సి ఉండగా అందలేదు. ప్రస్తుతం ఇతర దేశాల పిక్కలపైనే ఆధారపడి ఉన్నాం. ప్రభుత్వం రాయితీలు కల్పించి పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలి.
- మల్లా శ్రీనివాసరావు, పీసీఎంఏ అధ్యక్షుడు, పలాస

కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి
పరిశ్రమల్లో కార్మికులకు సదుపాయాలు కల్పించాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ, కనీస వేతన చట్టాలను అమలు చేయాలి. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.
- బొంపల్లి సింహాచలం, జీడి కార్మిక సంఘం అధ్యక్షుడు, పలాస

Advertisement

తప్పక చదవండి

Advertisement