సీఎం పార్టీ పెట్టినా భూస్థాపితమే: పాల్వాయి | Sakshi
Sakshi News home page

సీఎం పార్టీ పెట్టినా భూస్థాపితమే: పాల్వాయి

Published Wed, Jan 15 2014 10:30 PM

సీఎం పార్టీ పెట్టినా భూస్థాపితమే: పాల్వాయి - Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీపెట్టినా, పెట్టకున్నా ఒక్కటేనని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతారో... ఆతరువాత రాజకీయంగా భూస్థాపితమే అవుతారో కానీ వాటితో తమకు సంబంధం లేదని తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నాలేవీ ఫలించవని అన్నారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌కు పిచ్చిపట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద భూములను సెటిల్‌మెంట్లు చేస్తూ కోట్లాది రూపాయలుదండుకుంటున్నారని ఆరోపించారు. సీఎంను క్షణాల్లో తప్పించే అవకాశమున్నా సోనియా గాంధీ ఓపిక పడుతున్నారని, పగసాధిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని వెనుకడుగు వేస్తున్నారే తప్ప వేటు వేయలేక కాదని స్పష్టంచేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదన్నారు. 

ఏఐసీసీ సమావేశంలో సమైక్యం పేరుతో గొడవ చేస్తే అక్కడి కార్యకర్తలు వారిని మెడపట్టి గెంటేస్తారని హెచ్చరించారు. అవినీతి అక్రమార్కులను పార్టీలో చేర్చుకోవద్దని ఏఐసీసీ సమావేశంలో తాను తీర్మానం ప్రవేశపెడతానని తెలిపారు. యువనేత రాహుల్‌గాంధీ పార్టీ ప్రభుత్వ పదవులు స్వీకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నార.  రాహుల్‌కు రాక్షస జాతికి చెందిన మోడీకి మధ్య యుద్ధం జరుగుతోందని అంతిమంగా రాహుల్ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం మోసాలతోనే గడిచిందని, ఆయనంత అబద్ధాల పుట్ట ఎవరూ లేరన్నారు.  
 
సోనియాకు ధన్యవాద తీర్మానం: పొంగులేటి
తెలంగాణ ఇచ్చినందున పార్టీ  అధినేత్రి సోనియా గాంధీకి ఏఐసీసీ సవూవేశంలో ప్రత్యేక ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈమేరకు ఏఐసీసీలో చర్చించాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని స్పష్టంచేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని రెండుచోట్లా భూస్థాపితం కావడం ఖాయమన్నారు.

Advertisement
Advertisement