భత్యాల్ని మెక్కేశారా! | Sakshi
Sakshi News home page

భత్యాల్ని మెక్కేశారా!

Published Tue, Sep 2 2014 1:06 AM

భత్యాల్ని  మెక్కేశారా!

సాక్షి, కాకినాడ : పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి రావాల్సిన టీఏ, డీఏలు (ప్రయాణ, దినభత్యాలు) నేటికీ రాలేదు. జిల్లాలో ఇందుకు సంబంధించి సుమారు రూ.2 కోట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జూలైలో మూడు విడతల్లో జిల్లాలోని 962 పంచాయతీల సర్పంచ్‌లకు, 10,742 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 23న రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లలోని 324 పంచాయతీలకు, రెండో విడతలో 27న కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని 369 పంచాయతీలకు, మూడో విడతలో 31న అమలాపురం డివిజన్‌లోని 272 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం 10,803 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 346 మంది స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు, 962 మంది స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారులతో పాటు ప్రతి స్టేషన్‌కూ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓ సహాయకుని చొప్పున  సుమారు 35 వేల మంది సిబ్బందిని వినియోగించారు.
 
 మండలానికో రకంగా కేటాయింపు..
 పొరుగు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు మంజూరైన నిధులను పంచాయతీల సంఖ్య ను బట్టి మండలాలకు కేటాయించారు. కానీ జిల్లాలో అలా కాక మండలానికో రీతిలో కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. తొలి విడతలో జరిగిన మండలాల పరిధిలోని పంచాయతీల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి భత్యాల చెల్లింపు పూర్తిగా జరిగినా.. తర్వాత రెండు విడతల్లో పాల్గొన్న సిబ్బందికి కనీసం 30 శాతం చెల్లించలేదు. మండలానికి రూ.7.50 లక్షల నుంచి రూ.9 లక్షల మేర మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాలకు కేటాయించగా, తర్వాత రెండు విడతల్లో  జరిగిన మండలాలకు కేవలం రూ.4.50 లక్షల లోపే కేటాయించారు.
 
 ఈ ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఒక్కో మండలానికీ ఏకంగా రూ.12 లక్షల చొప్పున మంజూరు చేశారు. కేవలం 57 జెడ్పీటీసీలతో పాటు 1063 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రూ.7 కోట్లకు వరకు చెల్లించారు. 962 సర్పంచ్‌లతో పాటు 10,742 వార్డు సభ్యులకు జరిగే పంచాయతీ ఎన్నికలకు మాత్రం అరకొర కేటాయింపులు జరపడం గమనార్హం. పోనీ ఆ కొద్ది పాటి నిధులైనా పూర్తి స్థాయిలో కేటాయించారా అంటే అదీ లేదు. చివరి రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన కాకినాడ (9 మండలాలు), పెద్దాపురం (12 మండలాలు), అమలాపురం(16 మండలాలు) డివిజన్లలో ఒక్కో మండలానికీ ఇంకా రూ.5 లక్షల నుంచి రూ.ఏడులక్షల వరకు చెల్లిం చాల్సి ఉంది. అంటే 37 మండలాలకు రూ.5 లక్షల చొప్పున వేసుకున్నా సుమారు భత్యాలుగా చెల్లించాల్సింది రూ.1.85 కోట్ల వరకు ఉంటుందన్నమాట. వాస్తవానికి ఈ మొత్తం రూ.2.50 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
 
 తప్పుడు బిల్లులతో దారి తప్పిన సొమ్ము..!
 ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. మంజూరైన నిధులను జిల్లాస్థాయి అధికారులు ఇతర అవసరాలకు పక్కదారి పట్టించడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరంటున్నారు. అయితే కారణం అది కాదని, ఎన్నికల నిర్వహణ  నిధులను లెక్కాపత్రం లేకుండా ఇష్ట మొచ్చినట్టు తప్పుడు బిల్లులతో డ్రా చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికలను పర్యవేక్షించిన అధికారి జిల్లా ఉన్నతాధికారి వత్తాసుతోనే ఈ నిధులను దారి తప్పించారంటున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న ఉద్యోగులకు ఇంతవరకూ భత్యాలు చెల్లించని విషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా సకాలంలో బిల్లులు సమర్పించకపోవడం వలన రూ.60 లక్షలు వెనక్కి మళ్లిపోయాయన్నారు. అందువలనే భత్యాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా.. భత్యాలుగా ఇవ్వాల్సింది కోటి వరకు ఉంటుందని, కొన్ని మండలాలకు రూ.7 లక్షల వరకు ఇవ్వాలని అంగీకరించిన డీపీఓ మొత్తం నిధుల కోసం ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి రాశారని, రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. డీపీఓ చెప్పినట్టు రూ.60 లక్షలు వెనక్కి వెళ్లినా మిగిలిన దాదాపు రూ.2 కోట్ల మొత్తం ఏమైందన్న ప్రశ్న మిగిలిపోతోంది.
 

Advertisement
Advertisement