ఓటమి భయం వల్లేనా..? | Sakshi
Sakshi News home page

ఓటమి భయం వల్లేనా..?

Published Mon, Jun 4 2018 12:05 PM

Panchayat Elections Are Not Held In Khasapet - Sakshi

లక్కవరపుకోట(ఎస్‌కోట): నాలుగేళ్లుగా పంచాయతీల్లో ఉప ఎన్నికలు నిర్వహించకుండా టీడీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌ కానీ, వార్డు మెంబర్‌ కానీ మరణించినా, రాజీనామా చేసిన ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

మరోవైపు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడంతో బినామీ నాయకులు అధికారం వెలగబెడుతూ గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. శాసనానికి కట్టుబడి పాలన చేస్తాను అని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించని స్థితిలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. పంచాయతీలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంతో పలువురు కోర్టుకు వెళితే అక్కడే ఎన్నికలు పెట్టి, మిగిలిన గ్రామాల్లో నిర్వహించకుండా వదిలేశారు.

ఎందుకో ఆ భయం..

ఎందుకు పంచాయతీల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం లేదన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి చెందుతామనే ఆలోచన రావడం వల్లే ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. 2013 జూన్‌లో జిల్లాలోని 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి వివిధ కారణాల వల్ల 15 సర్పంచ్‌లు, 168 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

కానీ ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీని వల్ల సదరు గ్రామాలు, వార్డుల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఉప ఎన్నికలు నిర్వహించాలని పట్టు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎదో హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో విజయనగరం మండలం సారిక పంచాయతీలో ఉప ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. మిగిలిన చోట్ల గాలికొదిలేసింది. కుంటు సాకులు చెప్పడం తప్ప ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మండలంలోని ఖాసా పేట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ ఉప ఎన్నికలు జరగలేదు.

ఓటరు జాబితా తయారు చేశాం..

జిల్లాలో వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రెండు పర్యాయాలు ఓటర్‌ జాబితాను సిద్ధం చేశాం. కానీ ఎన్నికలు జరగలేదు. నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించాం.      – బి.సత్యనారాయణ, డీపీఓ.

నాలుగేళ్లు అవుతోంది..

మాది ఎల్‌కోట మండలంలోని ఖాసా పేట గ్రామం. మా సర్పంచ్‌ మరణించి నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉప సర్పంచే అన్ని తానై అధికారం చెలాయిస్తున్నాడు. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ పని అధికారులు చేయలేదు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం తలెత్తుతుంది.

– సిహెచ్‌. మాధవరావు,ఖాసాపేట,లక్కవరపుకోట. 

Advertisement

తప్పక చదవండి

Advertisement