పంచాయతీ నిధులు పక్కదారి | Sakshi
Sakshi News home page

పంచాయతీ నిధులు పక్కదారి

Published Mon, Sep 16 2013 1:59 AM

panchayat funds are distributed in wrong manner


 మేడ్చల్, న్యూస్‌లైన్: ఆయన ఓ బడా నాయకుడు.. ఇంకేముందు ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు నాయకుడు తలచుకుంటే జరగని పనేముంటుంది. మండలపరిధిలోని అత్వెల్లిలో ఉన్న ఓ రాజకీయ నేత భూమిలో కార్పొరేట్ పాఠశాల కోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. నెలనెలా అద్దె వస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా చకచకా మూడు నెలల్లో నిర్మాణం చేపట్టి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల పక్కనే ఓ బయోటెక్నిక్ కంపెనీ ఉంది. పాఠశాల నుంచి మురికి నీరు వెళ్లడానికి తన పొలం అడ్డుగా ఉండడంతో సదరు నాయకుడు తన పొలాల్లోకి రాకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చాడు. పాలక వర్గం లేకపోవడం (ఎన్నికల విషయం కోర్టులో ఉంది)తో పంచాయతీ అభివృద్ధి కమిటీ ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మాణానికి ప్రతిపాదించింది. వెంటనే అనుమతులు వచ్చాయి. ఎస్సీ కాలనీ నుంచి పనులు మొదలు పెట్టకుండా సదరు నాయకుడి పొలం నుంచి పాఠశాల దాటేంతవరకు దాదాపు రూ.8 లక్షల వెచ్చించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాఠశాల నుంచి వచ్చే మురికి నీటిని కాలువకు అనుసంధానం చేశారు. కింది భాగంలో కాలువను పూర్తి చేయకుండా హరిజనుల పొలాల్లోకి మురికి కాలువను అసంపూర్తిగా వదిలేశారు. పైభాగంలో ఎస్సీ కాలనీ మురుగు నీరు వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన పైపులైన్‌కు అనుసంధానం చేయలేదు. దీంతో కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా బయోటెక్నిక్ కంపెనీ ఎదుట ఉన్న ప్లాట్లలోకి చేరి మురికి కూపంలా మారింది. ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు వేయాల్సిన మురికి కాలువను కేవలం నాయకుడికి చెందిన స్థలం వరకు మాత్రమే పూర్తి చేసి నిధులు లేవని అధికారులు చేతులు దులుపుకున్నారు.


 ఇబ్బందులు పడుతున్న రైతులు, కాలనీవాసులు
 నాయకుడి స్వార్థం కోసం పంచాయతీ అధికారులు అనాలోచితంగా డ్రైనేజీ నిర్మించడంతో ఎస్సీ కాలనీ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి సమీపంలో మురికి నీరు వదిలేయడంతో మురికి కూపంగా మారింది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కాలువను పూర్తిగా నిర్మించకుండా ఎస్సీ పొలాల్లోకి మురికి నీరు వదిలేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.  
 
 తప్పులు దొర్లాయి.: నర్సింహారెడ్డి, గ్రామ కార్యదర్శి
 అత్వెల్లి ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మించడంలో కొన్ని తప్పులు దొర్లాయి. ఇళ్ల నుంచి పనులు మొదలు పెట్టకుండా మధ్యలో మొదలు పెట్టడంతో డ్రైనేజీ సమస్య ఏర్పడింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ పనీ సరిగా చేయలేకపోతున్నాం.

Advertisement
Advertisement