త్రిశంకు స్వర్గంలో ‘పారా’ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

త్రిశంకు స్వర్గంలో ‘పారా’ విద్యార్థులు

Published Thu, Nov 28 2013 1:44 AM

త్రిశంకు స్వర్గంలో ‘పారా’ విద్యార్థులు - Sakshi

ఇంటర్ పారామెడికల్ కోర్సులకు అనుమతి నిరాకరణ
30 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయం
కాలేజీ యాజమాన్యాల వైఖరితో ఓ ఏడాది కోల్పోయే పరిస్థితి
ఇకపై ఇంటర్ తర్వాతే పారా మెడికల్ కోర్సులకు అనుమతి

 
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో భాగంగా పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియెట్ బోర్డు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరి కారణంగా దాదాపు 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయం అయ్యింది. వీరంతా ఇప్పుడు ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కనీస విద్యార్హతగా ఇంటర్మీడియెట్‌ను పారామెడికల్ బోర్డు నిర్ణయించడంతో ఆ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో 65ను గత వేసవిలో విడుదల చేసింది. పారామెడికల్ కోర్సుల్లో నాణ్యత పేరుతో విద్యార్థులు కనీస విద్యార్హతగా ఇంటర్ బైపీసీ చదవాలని, బైపీసీ అభ్యర్థులు లేనిపక్షంలో ఎంపీసీ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించాలని, వారూ లేనిపక్షంలో ఇతర గ్రూపుల్లో చదివిన వారిని ఎంపిక చేయాలని పారామెడికల్ బోర్డు నిర్ణయించింది. దీంతో పదో తరగతి అర్హతతో ఉన్న ఇంటర్‌లోని పారామెడికల్ కోర్సులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్‌టీ), మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ), ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, డెంటల్ హైజెనీస్ట్ తదితర ఆరు వొకేషనల్ కోర్సులు రద్దు చేస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఈ ఏడాది మే 22న ఒక ప్రకటన జారీ చేశారు.
 
  ఏటా 70 వేల మంది చదివే ఇంటర్ పారామెడికల్ కోర్సులు తక్షణం ఉపాధి కల్పించేవిగా నిరుపేద విద్యార్థుల ఆదరణకు నోచుకున్నాయి. కానీ వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఇంటర్ బోర్డు ఈ కోర్సులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది జూన్ 26న పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవద్దంటూ ఇంటర్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ప్రైవేటు వొకేషనల్ జూనియ ర్ కళాశాలలు దాదాపు 30 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాయి. ఇంటర్ బోర్డు కూడా వీరందరికీ రోల్ నంబర్స్ కేటాయించింది. కానీ, ఈ కేసులో హైకోర్టు ఈ నెల 26న తుది తీర్పు వెలువరించింది.
 
  పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని సమర్థించిన న్యాయస్థానం వొకేషనల్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఈ కోర్సులు, ఇప్పటివరకు చేపట్టిన ప్రవేశాలు చెల్లకుండా పోనున్నాయి. అంటే ఈ ఏడాది ప్రవేశాలు పొందిన 30 వేల మంది విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్నేళ్లుగా ఇంటర్‌లో ఎంఎల్‌టీ తదితర పారామెడికల్ కోర్సులు చదివిన వారు ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ చేసి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని నేరుగా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు సంపాదించేవారు. విస్తృతంగా ఉన్న డయాగ్నసిస్ కేంద్రాలు, డెంటల్ ఆస్పత్రులు, కంటి ఆస్పత్రుల్లో సహాయకులుగా చిరుద్యోగాల్లో చేరేవారు. వీరికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
 
  ఇప్పుడు ఈ కోర్సులు రద్దయితే ఇలా ఉపాధి పొందాలనుకునేవారు అటు ఇంటర్ పూర్తి చేయాలి. మళ్లీ రెండేళ్ల పాటూ ఈ పారామెడికల్ కోర్సులు చదవాలి. అతి తక్కువ ఖర్చుతో చిరుద్యోగాలు క ల్పించే ఈ కోర్సులకు ఇకపై అదనంగా వెచ్చించాల్సి రావడం పేద విద్యార్థులకు భారమే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ తర్వాత పారా మెడికల్ కోర్సులు అందించే కళాశాలలు 304 ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఉన్న సీట్లు 13,137 మాత్రమే. వేలాది మంది విద్యార్థులు ఈ కోర్సులు చదివి ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ఈ అరకొర సీట్లు ఏమూలకూ సరిపోవు.

Advertisement
Advertisement