అంతులేని నిరీక్షణ | Sakshi
Sakshi News home page

అంతులేని నిరీక్షణ

Published Sat, Apr 30 2016 9:27 AM

parents crying for his son

తప్పిపోయిన తనయుడు మనోజ్ కోసం
నాలుగేళ్లుగా ఎదురుచూపు
కన్నబిడ్డ రాకకై తల్లి ఆరాటం
 
చేతికి అందివచ్చిన కొడుకు నాలుగేళ్లుగా కనిపించక పోవటంతో కన్నతల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. ఎక్కడైనా కొడుకు కనిపించకపోతాడా అన్న ఆశతో చూసి చూసి వారు కళ్లు కాయలు కాశాయి. ‘అమ్మా! ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంతవరకూ ఇంటికి రాలేదు. పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనిపించినట్టే కనిపించి మాయమయ్యాడని కొందరు స్నేహితులు, బంధువులు చెప్పటంతో ఎప్పటికైనా ఇంటికి తిరిగి రాకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తున్న ఆ కన్నవారి ఆవేదనకు ఇది అక్షరరూపం.  
 
విజయలక్ష్మి, శివకుమార్ దంపతులు తొమ్మిదేళ్ల కిందట సామర్లకోట నుంచి వైజాగ్ వచ్చేశారు. ప్రహ్లాదపురంలో ఫర్నిచర్ వ్యాపారంలో స్థిరపడ్డారు శివకుమార్. వాళ్లకు ఇద్దరబ్బాయిలు విశ్వతేజ, మనోజ్. పెద్ద కొడుకు ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగి. చిన్నకొడుకు సింహాచలం అప్పన్న గుళ్లో సెక్యూరిటీ ఉద్యోగి. నాలుగేళ్ల కిందటి వరకు వారిది సంతోషమైన కుటుంబం. ఇలా సాగిపోతున్న వారి సంసారంలో ఒక పెద్ద కుదుపు. 2012 ఆగస్టు నెల23న ఎప్పటి లాగానే తండ్రీ కొడుకులు ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. మనోజ్ మధ్యాహ్నం మూడున్నరకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడున్నరకు స్నేహితుడి నుంచి అతడికో ఫోన్ వచ్చింది. ‘అమ్మా! ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంత వరకు రాలేదు.  
 
 ఒడిశాలో ఉన్నాడా!: ‘బాబెళ్లి నాలుగేళ్లయింది. ఆ రోజు... మనోజ్ ఇంటి నుంచి వెళ్లిన గంటకు కూడా రాకపోయేసరికి ఫోన్ చేశాను. అప్పటికే ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. సినిమాకెళ్లాడేమో అనుకున్నాను. ఎంతరాత్రయినా రాలేదు. తెల్లా ర్లూ అలా కూర్చునే ఉన్నాను. ఉదయా న్నే మనోజ్ ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాం. ఎవరూ తమకేమీ తెలియదన్నారు.

అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అంజనం వేయిస్తే ఒడిశాలో ఉన్నాడని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే అక్కడికి వెళ్లి బాబు ఫొటో చూపిస్తూ కనిపించిన అందరినీ అడిగాం. మజ్జిగైరమ్మ గుళ్లో కొందరు ‘ఇప్పుడే చూశాం’’ అన్నారు. అక్కడే హోటల్లో కూడా ‘ఇప్పుడే భోజనం చేసి వెళ్లాడు’ అని చెప్పారు. దాంతో మాకు కొండంత ఆశ కలిగింది. బాబు మాత్రం కనిపించలేదు. బాబు ఫొటో కనిపించిన సెక్యూరిటీ ఉద్యోగులందరికీ ఇచ్చాం. ఎన్నో పూజలు చేయించాం.

ఓసారి మా వదినకు తిరుపతితో కనిపించాట్ట. తాను క్యూలైన్‌లో ఉండగా పదడుగుల దూరంలో కనిపించి ‘మనోజ్’ అని పిలవగానే ఆమెను చూసి పరుగెత్తుకు పోయాడని చెప్పింది. పెంబర్తి పోలీస్ స్టేషన్‌కైతే వందసార్లకంటే ఎక్కువగానే వెళ్లాం. పోలీసులు మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ దొరకలేదు’ అని కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు విజయలక్ష్మి.  
 
 కొడుకుపై బెంగతోనే : క్షణక్షణం కుమారుడిపై బెంగతోనే తల్లి విజయలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. ఈ నాలుగేళ్లలో రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్‌లు చేయాల్సి వచ్చింది. చిన్న కొడుకు ప్రతి చిన్న విషయాన్నీ తనతో చెప్పేవాడు. అలాంటిది ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడో అని తనను తానే ప్రశ్నించుకుంటోంది. అసలు ఉన్నాడో లేదో అనే భావన కలిగితేనే ఆమె హృదయం తల్లడిల్లిపోతోంది. తన సోదరుడి ఆచూకీ తెలిస్తే 97037 09619, 9391309803 నంబర్లకు తెలియజేయాలని మనోజ్ సోదరుడు విశ్వతేజ కోరుతున్నారు.
 
 సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం
 ఏ అమ్మాయినైనా ఇష్టపడి ఆ సంగతి చెప్పలేకపోయాడేమో? ఇంట్లో ఒప్పుకోరని నాతో కూడా చెప్పకుండా దాచాడేమో నా పిచ్చితండ్రి. ఒకవేళ అలాంటిదే ఉంటే బాబు ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నా మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉంటే భార్యాబిడ్డలతో వస్తే సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం.
 - విజయలక్ష్మి, మనోజ్ తల్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement