ఉద్యానవనంలో గంజాయి మొక్క | Sakshi
Sakshi News home page

ఉద్యానవనంలో గంజాయి మొక్క

Published Fri, Feb 7 2014 4:49 AM

Park the cannabis plant

దేవరకొండ, న్యూస్‌లైన్: అతనొక ఉద్యానవన శాఖ అధికారి.. పచ్చగా ఉంచాల్సిన ఉద్యానవన శాఖలో అతనే గంజాయి మొక్కయ్యాడు. పచ్చని చెట్లకు అవినీతి పందిరి అల్లుతూ లంచం పేరుతో రైతులను పీడించాడు. పైస పైసకు కక్కుర్తి పడి రైతులను వేధించడంతో కడుపు మండిన రైతులే పక్కాగా ప్లాన్ వేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. పథకం ప్రకారం వల వేయడంతో దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన రైతు
 నేనావత్ గోపాల్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో గురువారం చిక్కుకున్నాడు ఆ అధికారి.
 
 తిరిగి..తిరిగి.. ఏసీబీకి ఫిర్యాదు
 పందిరి నిర్మాణానికి ఉద్యానవన శాఖ లక్షా 20వేల రూపాయల రుణం ఇస్తుంది. ఇందులో 50శాతం సబ్సిడీ ఉంటుంది. ఈ రుణం పొందేందుకు నేనావత్ గోపాల్ నాలుగు నెలల క్రితం ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పందిరి కూడా నిర్మించుకున్నాడు. అయితే, పందిరి నిర్మాణం అనంతరం దానిని ఉద్యానవన శాఖ అధికారి ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ పని చేయడానికి అధికారి భాస్కర్ రైతు గోపాల్ తరచూ తిప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనకు రూ.30వేలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. చివరకు రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అయినా, పని చేయకుండా కొన్ని రోజుల నుంచి రోజూ కార్యాలయానికి తిప్పించుకుంటున్నాడు.
 
 దీంతో విసిగిపోయిన రైతు గోపాల్ ఈ నెల 3వ తేదీన అధికారి భాస్కర్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని గురువారం గోపాల్ నుంచి భాస్కర్ రూ. 20వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై పంచనామా నిర్వహించారు. ఈ దాడిలో నల్గొండ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, నల్గొండ ఇన్‌స్పెక్టర్ ముత్తు లింగయ్య, రంగారెడ్డి ఇన్‌స్పెక్టర్ రాజు, మహబూబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 భాస్కర్ అవినీతి చిట్టా...
 దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ రైతులనుంచి ముక్కుపిండి లంచాలు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు భాస్కర్ ఏసీబీకి పట్టుబడడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 రైతులకు అందుబాటులో ఉండకుండా ప్రతిదానికీ లంచాలు అడుగుతూ రైతులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి.
 
     పీఏపల్లి మండలం ఎల్లాపురంలో ఓ రైతు దగ్గర లంచం అడగడంతో ఆ రైతు రెండు సంవత్సరాల క్రితమే ఏసీబీని ఆశ్రయించాడు. లంచం అడుగుతున్న విషయాన్ని ముందస్తుగా రికార్డింగ్ చేస్తున్నట్టు సమాచారం లీకవడంతో భాస్కర్ అప్పట్లో తప్పించుకున్నాడు.
 దేవరకొండ మండలం గుమ్మడవల్లి గ్రామపంచాయతీ పరిధిలో దొండతీగకు రుణం మంజూరు చేయడానికి రూ.3వేలు లంచం పుచ్చుకున్నట్లు ఓ రైతు ఆరోపించారు.
 
 రైతులను పీడించి లంచాలు వసూలు చేసే భాస్కర్‌కు, రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక సలహామండలి సభ్యుడు అబ్బనమోని శ్రీనుకు మధ్య వివాదం జరగడంతో కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌కు భాస్కర్‌పై ఫిర్యాదు కూడా చేశారు.
 
 కూరగాయల సాగు, బత్తాయి తోటల పెంపకం, ముదురు తోటల పునరుద్దరణ పథకంలో భాగంగా భాస్కర్ పీఏపల్లి మండలం పోల్కంపల్లి, మాధాపురం, కోనాపురం, ఊట్లపల్లి, దేవరకొండ మండలం గుమ్మడవల్లి గ్రామాల పరిధిలోని రైతుల వద్ద లక్షల రూపాయలను లంచం రూపంలో పొందినట్లు ఆరోపణలున్నాయి.
 
 వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన రైతులకు అందుబాటులో ఉండకుండా రైతులను సతాయిస్తుండడంతో రైతులు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దృష్టికి తీసుకవెళ్లారు.. ఇటీవల ఎమ్మెల్యే భాస్కర్‌ను పిలిపించి తీవ్రంగా మందలించి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
 
 సాధారణంగా 3సంవత్సరాలకు మించి ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకేచోట ఉండకూడదని నిబంధనలున్నప్పటికీ ఉన్నతాధికారుల అండదండలతో 2008 సంవత్సరం  నుంచి భాస్కర్ దేవరకొండలోనే పనిచేస్తున్నాడు.
 
 2014జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని మరునాడే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement