‘విభజన రాజకీయ లబ్ధికే’.. | Sakshi
Sakshi News home page

‘విభజన రాజకీయ లబ్ధికే’..

Published Fri, Aug 23 2013 5:18 AM

'Partition political awareness

రాయదుర్గం, న్యూస్‌లైన్:   రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, టీడీపీలు విభజన నిర్ణయం తీసుకున్నాయని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా నాలుగు రోజులుగా రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు భారతిని గురువారం ఆయన పరామర్శించి, సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రం అతలాకుతలమైందని ధ్వజమెత్తారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ అనైతిక చర్యకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. అసమర్థ ముఖ్యమంత్రితోపాటు, కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని కోరారు. విదేశీ మహిళ కారణంగానే నేడు ఈ పరిస్థితి నెలకొందన్నారు.పాకిస్థాన్, చైనాలు దేశంలో చొరబడి సైనికులను చంపుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 రాజీనామా చేయండి: విశ్వేశ్వర రెడ్డి
 ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లైతే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో కాపు భారతి ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం వ్యక్తం చేస్తూ విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. ఆరు నెలల్లో ఎన్నికలు రానుండగా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎంపీ సీట్లు కూడ గెలిచే అవకాశం లేకపోవడంతో విభజన నిర్ణయం ప్రకటించారని విమర్శించారు.
 
 సమైక్యాంధ్ర కోరుతున్న ఎంపీలు, మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే తక్షణమే రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడు తన విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెబుతున్నారని, లేఖకు కట్టుబడి ఉంటే ఆపార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎందుకు దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ధిక్కరించినట్లైతే ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని నాయకులను ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కార్యాలయం ముందు దీక్షలు చేయాలని సూచించారు. తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామాలు చేశారని తెలిపారు.
 
 విభజన వద్దని చంద్రబాబుతో లేఖ ఇప్పించండి:
 శంకర్‌నారాయణ
 విభజన వద్దని చంద్రబాబుతో కేంద్రానికి లేఖ ఇప్పించాలని ైవైఎస్సార్ సీపీ జిల్లా అడ్‌హక్ కన్వీనర్ శంకరనారాయణ టీడీపీ నాయకులకు సూచించారు.   కాపు భారతి ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ  వైఎస్ విజయమ్మను ప్రశ్నించే అర్హత పయ్యావుల కేశవ్‌కు లేదన్నారు.
 
 చంద్రబాబు లేఖ ఇస్తే విభజన ఆగుతుందని అందరికీ తెలుసునని, ఇకనైనా టీడీపీ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలని కోరారు. ఆత్మగౌరవం పేరిట యాత్ర చేస్తానని చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. రాయలతెలంగాణా పేరుతో రాయలసీమను చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విజయమ్మకు మద్దతుగా దీక్ష చేస్తున్న కాపు భారతికి అభినందనలు తెలిపారు.  ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి,   పేర్మి బాలాజీ, లింగాల రమేష్, మాధవరెడ్డి, జిల్లా  బుజ్జిరెడ్డి, మహేష్, దిలావర్‌బాష, జగన్నాథ్,రూరల్ కన్వీనర్ మల్లికార్జున, ఉపేంద్రరెడ్డి, మీసాల రంగన్న, శరత్‌చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమామ్,  లింగాల రమేష్, ఓబుళపతి, ఆశోక్ కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement