పాస్‌పోర్ట్ ఒక్క రోజులోనే క్లియరెన్స్ | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్ ఒక్క రోజులోనే క్లియరెన్స్

Published Sun, Jun 7 2015 4:28 AM

పాస్‌పోర్ట్ ఒక్క రోజులోనే క్లియరెన్స్ - Sakshi

♦ ఆధునిక పరిజ్ఞానంతో పారదర్శక సేవలు
♦ ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు
♦ అమల్లోకి తెచ్చిన గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం

 
 గుంటూరు ఎడ్యుకేషన్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు పాస్‌పోర్ట్ కోసం ఇకపై రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్ట్ పొందేందుకు అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు సమర్పించిన తరువాత ఒక్కరోజు వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయి పాస్‌పోర్ట్ అందుకునే విధానం అమల్లోకి వచ్చింది. గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం ఈ ప్రక్రియను ఇటీవల ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. 

‘‘జీయూపీ సేవ డాట్ ఇన్’’ పేరుతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టునే గుంటూరు అర్బన్ పోలీసులు అమల్లోకి తెచ్చారు. జీయూపీ అంటే గుంటూరు అర్బన్ పోలీసు అని అర్ధం. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులోని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన ఆరుగురు బీటెక్ గ్రాడ్యుయేట్లు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానంలో జరుగుతున్న పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను నూతన విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తుదారుడికి ఎస్‌ఎంఎస్ వెళుతుంది.

అందిన దరఖాస్తులను అర్బన్ పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లకు పంపుతారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు సమర్పించిన దరఖాస్తు దారుడి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లే కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికీ ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించి జరిగే పరిశీలన, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే అంశాలన్నీ పూర్తి పారదర్శకంగా జరగడం ఇందులోని ముఖ్యాంశం. తద్వారా సింగిల్ విండో విధానంలో పాస్‌పోర్ట్‌కు క్లియరెన్స్ రావడంతో పాటు అవినీతికి తావులేని విధంగా పారదర్శకత ఉంటుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు ప్రత్తిపాటి వెంకటేష్ బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, డెరైక్టర్ డాక్టర్ శ్రీకాంత్, ఈసీఈ విభాగాధిపతి ఎస్డీఎల్వీ ప్రసాద్ అభినందించారు.

Advertisement
Advertisement