పాస్టర్ ముసుగులో రూ.8 లక్షలు స్వాహా | Sakshi
Sakshi News home page

పాస్టర్ ముసుగులో రూ.8 లక్షలు స్వాహా

Published Fri, Sep 6 2013 4:51 AM

Pastor mask Rs .8 million Swaha

 కొండపి, న్యూస్‌లైన్ :పాస్టర్ ముసుగులో పేదలను నమ్మించిన ఓ వ్యక్తి 8 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. గ్రామాల్లోని నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కనీసం తన పేరు, కంపెనీ పేరు కూడా చెప్పకుండా పొదుపు పేరుతో డబ్బు వసూలు చేశాడు. ఏజెంట్లను నియమించి మరీ అక్రమాలకు పాల్పడ్డాడు. మండలంలోని మూగచింతల గ్రామంలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి మండలంలోని మూగచింతలతో పాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో పాస్టర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో పొదుపు స్కీం పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బు వసూలు చేశాడు. మూగచింతలతో పాటు చీమకుర్తి, 
 
 తదితర ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం నియమించాడు. వారెవరికీ తన పేరుతో పాటు ఇతర వివరాలేమీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఒక్క మూగచింతల గ్రామంలోనే సుమారు 8 లక్షల రూపాయలు వసూలు చేయించినట్లు తెలుస్తోంది. స్కీం గడువు పూర్తవడంతో డబ్బు చెల్లించాలంటూ గ్రామస్తులు కోరారు. వారి నుంచి బాండ్లు, రసీదులు తీసుకెళ్లిన ఏజెంట్లు నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకపోవడంతో ఒత్తిడిచేశారు. దీంతో ఆ ఏజెంట్లు సదరు పాస్టర్‌ను నిలదీశారు. నష్టాలు వచ్చాయని, కంపెనీ ఎత్తివేశానని పాస్టర్ చెప్పడంతో.. ఏజెంట్లు అదేమాటను బాధితులకు చెప్పారు.ఈ క్రమంలో చీమకుర్తికి చెందిన ఓ మహిళకు మూగచింతలలో బంధువులు ఉండటంతో వారిద్వారా పాస్టర్‌ను పట్టుకుని నిలదీసింది. ఆమెతో పాటు మూగచింతలకు చెందిన బాధితుల ఒత్తిడికి తలొగ్గిన పాస్టర్.. మొత్తం డబ్బుచెల్లించలేనని, 4 లక్షల రూపాయలు చెల్లిస్తానని కొందరు మధ్యవర్తుల ద్వారా బాధితులకు తెలిపాడు. 
 
 దీంతో మోసపోయామని తెలుసుకున్న మూగచింతలకు చెందిన మహిళలు బుధవారం రాత్రి కొండపి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తన్నీరు ఆదెమ్మ, శేషమ్మ, రేణుక, శింగమ్మ, కుంచాల శే షమ్మతో పాటు మరికొందరు మహిళలు కలిసి పాస్టర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఎస్సై లేకపోవడంతో కాసేపు వేచిచూసి వెళ్లిపోయారు. వారంతా ఒక్కొక్కరు 10 వేల రూపాయల వరకూ పాస్టర్‌కు కట్టినట్లు తెలిపారు. మూగచింతలతో పాటు చీమకుర్తి తదితర గ్రామాల్లో కలిపి మొత్తం 50 లక్షల రూపాయల వరకు పాస్టర్ వసూలు చేసి ఉంటాడని సమాచారం. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్సై సోమశేఖర్‌ను వివరణ కోరగా... బాధితుల నుంచి ఇంకా తనకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement