నారీలోకం.. నీరాజనం | Sakshi
Sakshi News home page

నారీలోకం.. నీరాజనం

Published Wed, May 29 2019 12:46 PM

Pasupu Kunkuma Not Working in Andhra Pradesh Election 2019 - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు : డ్వాక్రా మహిళలు మాకే ఓటేశారు. పసుపు–కుంకుమతో వారిని ఆకట్టుకున్నాం... జనవరి నుంచి ఏప్రిల్‌ లోపు రూ.20 వేలు ఇచ్చాం... మాకు అడ్డులేదు. ఆడపడచులే మమ్మల్ని గెలిపిస్తారు... ఇది చంద్రబాబే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ప్రచారం. ఇది వైఎస్సార్‌సీపీ నేతల్లో కొంత ఆందోళన కలిగించినా చివరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే నారీలోకం మద్దతు పలికారు. çపసుపు–కుంకుమతో వారిని ఏమార్చాలని చేసిన యత్నాలను  తిప్పికొట్టారు. కనీసం డ్వాక్రా సంఘాల మహిళలు 5.66 లక్షల మంది ఓట్లు వేసినా టీడీపీకి ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరిగేది. ఇదే జరిగితే లక్షల్లో పెరగాల్సిన ఓట్లు వేల సంఖ్యలో కూడా పెరగలేదు. ఆడపడుచులు చంద్రబాబు ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన వరాలకు ఆకర్షితులయ్యారు. చంద్రబాబుకు పసుపు పూసి వైఎస్‌ జగన్‌ను కుంకుమతో ఆశీర్వదించారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీకి జైకొట్టిన మహిళలు
జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయం వెనుక మహిళమణులదే ప్రధాన భూమిక. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 20,56,660 ఉండగా అందులో పురుష ఓటర్లు 10,15,964, మహిళా ఓటర్లు 10,40,400, ఇతరులు 296 మంది ఉన్నారు. పురుషుల కంటే 24,436 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17,02,981 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 8,29,063, మహిళలు 8,73,843 ఓటేశారు. పురుషుల కంటే మహిళలు 44,780 మంది అధికంగా ఉన్నారు. పోలైన ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 10,18,141 మంది జై కొట్టగా టీడీపీకి 5,75,197 ఓట్లేశారు.

పసుపు–కుంకుమతో మాయ
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ తరుఫున డ్వాక్రా సంఘాలు 35,856, మెప్మా తరుఫున 12,561 వేల సంఘాలున్నాయి. ఇందులో 4,66,440 మంది సభ్యులున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ–2 పథకాన్ని ప్రకటించి ఒక్కోకరికి రూ.10 వేల రూపాయల పోస్ట్‌ డేటేడ్‌ చెక్కులిచ్చి హంగామా చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి గొప్పలు పోయారు. చంద్రబాబుకు అభినందనలంటూ మహిళలను బలవంతంగా విజయవాడ తీసుకెళ్లి నానా హింసలు పెట్టారు. మూడు చెక్కులను ఎన్నికలు సమీపించిన వేళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నగదును ఖాతాల్లో వేసేలా ప్రణాళిక వేశారు. మూడో విడత చెక్కులు ఎన్నికలకు ఆరు రోజులముందు బ్యాంకులో జమ చేసినా నగదు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పుకోలేదు. దీంతో అధికారులతో ఒత్తిడి చేయించి నగదు జమ చేయించాలని చూశారు. కొంతమందికి నగదు అందినా అధికశాతం మందికి మాత్రం ఖాతాల్లో జమ కాలేదు.

బాబును నమ్మని మహిళలు
2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచెయ్యి చూపారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. తిరిగి ఎన్నికలు సమీపించిన వేళ అధికారంలోకి వస్తే ఏటా పసుపు–కుంకుమ కింద రూ.10వేలు చొప్పున ఇస్తామని బూటకపుహామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళలే లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వాగ్ధానాలను వారు నమ్మలేదు.

తలకిందులైన అంచనాలు
టీడీపీ అంచనాలు తలకిందుల చేస్తూ ప్రలోభాలతో తమను మాయ చేయలేరని ఓటర్లు నిరూపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పారు. గడిచిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో  కుదువ పెట్టిన బంగారు నగలు, పుస్తెలతాడు పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రచారంతో ఊదరగొట్టి గద్దెనెక్కాక హామీలను ఆటకెకికంచేసి వార్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. కనీసం వడ్డీలేని రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ సొమ్ములనే పసుపు–కుంకుమ రూపంలో పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూశారు. ఐదేళ్లలో పట్టించుకోకుండా ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన గిమ్మిక్కులను మహిళలు ఏ మాత్రం పట్టించుకోలేదు.

మహిళల ఓట్లే అధికం
పోలైన ఓట్లలో అధికశాతం డ్వాక్రా సభ్యులవే. పసుపు–కుంకుమ మాయలో మహిళల ఓట్లు పడిఉంటే టీడీపీకి అధికంగా ఓట్లు వచ్చేవి. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. డ్వాక్రా మహిళలే దాదాపు 4.66 లక్షలమంది ఉన్నారు. కానీ జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 5.76లక్షలు మాత్రమే. అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి 10లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే పురుషులతో పాటు మహిళలు అధికసంఖ్యలో వైఎస్‌ జగన్‌ను నమ్మారని అర్థమవుతోంది.

పనిచేయని చంద్రబాబు ఎత్తులు
మహిళామణుల ముందర పసుపు–కుంకుమ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఎవరెన్ని చేసినా తాము అనుకున్నదే చేస్తామని నిరూపించారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని అందించడంతో ముఖ్యపాత్ర పోషించారు. జిల్లా జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళలు గెలుపు ఓటమిల్లో తమదైన పాత్ర ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా మగువలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్టం కట్టారు.

చంద్రబాబును నమ్మలేకపోయారు
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డ్వాక్రా మహిళలు చంద్రబాబును నమ్మలేకపోయారు. ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చినా వాటి పరిస్థితి అంతేనని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేశారు.– శారదమ్మ, జడ్పీటీసీ, పోరుమామిళ్ల

Advertisement
Advertisement