సమన్వయలోపం.. రోగులకు శాపం | Sakshi
Sakshi News home page

సమన్వయలోపం.. రోగులకు శాపం

Published Sat, Nov 9 2013 4:24 AM

patients suffer in NiZamabad hospital

కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందనుకున్న జిల్లాకేంద్రంలోని పెద్దాస్పత్రి నరకాన్ని చూపుతోంది. వైద్యం కోసం వచ్చే రోగులకు తూతూ మంత్రంగానే సేవలందుతున్నాయి. ఇందుకు పెద్దాస్పత్రిలో వైద్యాధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం. వైద్య కళాశాల ప్రారంభం కావడంతో రోగుల తాకిడి విపరీతం పెరిగింది. వారికి వైద్యం అందించాల్సిన వైద్యులు మాత్రం ఆ వైపు రావడం లేదు.
 
 కళాశాల పరిధిలోకి రాని ఆస్పత్రి..
 జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైనందున మెరుగైన వైద్య సేవలందుతాయని జిల్లాప్రజలు భావించారు. నాలుగేళ్లుగా కళాశాల ఏర్పాటు, వాటి సేవల కోసం ఎదురు చూశారు. ఈ ఏడాది కళాశాల ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆస్పత్రికి 96మంది ప్రొఫెసర్లు, 26మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు. అయినా ఏం లాభం.. వీరు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్తులోనే కొనసాగిస్తున్నారు. వైద్యకళాశాల ప్రారంభమై నాలుగు నెలలైనా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోకి తీసుకోవడం లేదు. దీంతో కళాశాలకు నియమితులైన వైద్యులు ఆస్పత్రి తమ పరిధిలో లేదంటూ వైద్యసేవలను అందించడం లేదు. రిజిష్టర్‌లలో మాత్రం సంతకాలు చేస్తూ.. ఇంటికే పరిమితమవుతున్నారు.
 
 పత్తా లేరు..
 పెద్దాస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 15మంది  వైద్యులు బయట ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహిస్తూ కేవలం ఓపీ విభాగానికి మాత్రమే పరిమితమవుతున్నారు. వరంగల్ కాకతీయ కళాశాల నుంచి ఓ వైద్యుడిని పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడికి కేటాయించారు. ఆయన ఇంతవరకు ఆస్పత్రికి రాలేదు. గతనెల 26న ముగ్గురు స్త్రీవైద్య నిపుణులు కళాశాల ఏర్పాటులో భాగంగా నియమితులయ్యారు. వీరు కేవలం మూడురోజులు మాత్రమే వైద్య సేవలందించి సెలవుల్లో వెళ్లిపోయారు. వైద్యకళాశాలలో భాగంగా ఆస్పత్రికి సూపరింటెండెంట్ నియమితులయ్యారు. ఈయన కేవలం రెండే రెండుసార్లు వచ్చారు. ఆ తర్వాత పత్తాలేరు. ఆస్పత్రిలో అత్యవసరమైన మత్తుమందు వైద్యులు, న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, కార్డియాలజిస్టులు, రేడియాలజిస్టులు లేరు. కేవలం పెద్దాస్పత్రి వైద్యవిధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి రా నందునే చాలామంది విధులకు రావడం లేదని తెలిసింది.
 
 దారితప్పిన పరిపాలన..
 ఆస్పత్రిలో పరిపాలన విభాగం పూర్తిగా అదుపు తప్పింది. కళాశాలకు నియమితులైన వైద్యులు వైద్యవిధాన పరిషత్తు అధికారుల వద్ద తామెందుకు పని చేయాలంటూ రావడం లేదు. ఆస్పత్రిలో ప్రతిరోజూ 700మందికి పైగా అవుట్ పేషెంట్లు, దాదాపు 500మందికి పైగా ఇన్‌పేషెంట్లు వస్తున్నారు. ఇందులో అత్యవసర చికిత్స కోసం 30నుంచి 40 మంది వస్తున్నారు. వీరికి వైద్య సేవలందించడం, వైద్యుల డ్యూటీలు, సమయపాలన, ఇతర వ్యవహారాలను చూసుకునేందుకు అధికారులెవరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఉన్నవారిలో అనుభవం లేని వారికి బాధ్యతలు అ ప్పగించారు. మరోవైపు వైద్య సిబ్బంది కొరత సైతం సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతం మంజూరైన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ పోస్టుల భర్తీ వైద్య విధాన పరిషత్తు పరిధిలోనా లేక డీఎంఈ పరిధిలో జరుగుతాయా అన్నదీ సందిగ్ధమే.
 
 ఆలస్యం ఎందుకు..?
 జిల్లాకు 2008 సెప్టెంబర్‌లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు ప్రకటించారు. అనంతరం 2009లో కళాశాల ఖలీల్‌వాడి మైదానంలో ఏర్పాటుకు నోచుకుంది. పనులు చురుక్కుగా జరగడంతో 2012 డిసెంబర్ నాటికి 90శాతం పనులు పూర్తయ్యాయి. దీంతో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆ ఏడాది కళాశాలను ఎలాగైన ప్రారంభించాలన్న ఉద్దేశంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు సంబంధించి పనులను వేగంగా పూర్తి చేయించారు.  ఈ ఏడాది మే 16,17తేదీల్లో ఎంసీఐ బృం దం కళాశాల పరిశీలన చేపట్టింది. అనంతరం జూలైలో కళాశాలకు వంద ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. కౌన్సిలింగ్‌లో విద్యార్థులనూ కేటాయించారు. ఈ ప్రక్రియలన్నీ జరిగేలోపే వైద్య విధాన పరిషత్తు అధీనంలో ఉన్న పెద్దాస్పత్రిని డీఎంఈ పరిధిలోకి మార్పు చేయాలి. కానీ పాలకులు, అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని సాకుగా చూపుతూ కళాశాల వైద్యులు సేవలందించడానికి రావడం లేదు. ఇప్పటికైనా జిల్లా పాలకులు, అధికారులు దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.
 
 మా పరిధిలో లేదు..
 -సుమన్‌చంద్ర, వైద్యకళాశాల ప్రిన్సిపాల్
 ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న ఆస్పత్రి మా పరిధిలో లేదు. వైద్యవిధాన పరిషత్తులో ఉంది. దీంట్లో కళాశాల వైద్యులు వైద్య సేవలందించేందుకు వీలు లేదు. త్వరలోనే ఆస్పత్రి మా పరిధిలోకి వస్తుందని ఆశిస్తున్నాం. అయినా మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నాం.   

Advertisement

తప్పక చదవండి

Advertisement