పాదముద్రలు పట్టించేనా? | Sakshi
Sakshi News home page

పాదముద్రలు పట్టించేనా?

Published Wed, Jan 7 2015 2:32 AM

పాదముద్రలు పట్టించేనా? - Sakshi

తాడేపల్లి రూరల్/సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణ గ్రామాల్లో జరిగిన దహనకాండపై పోలీసుల క్లూస్ టీం మంగళవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. సంఘటన స్థలంలో లభ్యమైన పాదముద్రల ఆధారంగా వివరాల సేకరణకు నడుంకట్టారు. తాడేపల్లిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, గతంలో ఉండవల్లి, పెనుమాక పంచాయతీల పరిధిలో చిన్నచిన్న గొడవల్లో తలదూర్చిన యువకులను, వీరితో పాటు రైతులను సైతం తాడేపల్లి పోలీసుస్టేషనుకు పిలిపించారు.
 
సంఘటన స్థలంలో దొరికిన పాదముద్ర ఆధారంగా, దానికి సరిపోలి ఉండే వారి పాదముద్రలు సేకరించారు. ఎందుకు పిలిపించారో తెలియక రైతులు ఒకింత అసహనానికి గురయ్యారు. రౌడీషీటర్లతోపాటు తమ పాదముద్రలు కూడా సేకరించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
   
రైతులకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా విచారణ పేరుతో ప్రతిరోజూ ఇలా పోలీసుస్టేషనుకు పిలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గౌరవంగా బతుకుతున్న తమను ఇలా ప్రతిరోజూ స్టేషనుకు పిలిపించడం వల్ల  ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే తమకు చావు తప్ప వేరేమార్గం లేదంటున్నారు.
 
మూడు రోజుల క్రితం పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సంఘటనలో తాను పాల్గొన్నట్టు తెలిపి చివరకు పోలీసులను అయోమయానికి గురిచేశాడు.  అతను అబద్ధాలు చె్డపుతున్నట్టు తేలడంతో తిరిగి విచారణ చేస్తున్నారు.
 
మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కొందరిని పిలిపించిన పోలీసులు వారు చెప్పిన ఆధారాల ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన నిపుణులతో ఇద్దరు నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలు సిద్ధం చేశారు.
 
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై  ఆగని పోలీసుల వేధింపులు...
దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు సంబంధించి ఎలాంటి  సమాచారం తెలియకపోవడంతో పోలీసులు పలువురు అనుమానితులను స్టేషన్‌లకు పిలిచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అనేక మంది వైఎస్సార్‌సీపీ వర్గీయులను విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
 
టీడీపీ వర్గీయుల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ సీపీకి సంబంధించిన వారినే  టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్‌స్టేషన్‌లలో కూర్చోబెడుతుండటంతో గ్రామాల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మాని  విచారణ పారదర్శకంగా జరపాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
 
దహన కాండకు పాల్పడిన ఆ ఇద్దరూ ఎవరు..?
రాజధాని ప్రాంతంలోని పొలాల్లో దహన కాండకు పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని మొదటి నుంచి పోలీసులు చెబుతున్నప్పటికీ ఆ ఇద్దరూ ఎవరనేది తేలడంలేదు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం చూసినా ఇద్దరు వ్యక్తులే ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు మాత్రం పక్కా పథకం ప్రకారం సెల్‌ఫోన్, వాహనాలు వినియోగించకుండా జాగ్రత్తపడినట్లు అర్థమవుతోంది.  ఈ కేసులో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement
Advertisement