కన్నుమూసిన ‘యోధుడు’ | Sakshi
Sakshi News home page

కన్నుమూసిన ‘యోధుడు’

Published Mon, Mar 10 2014 2:17 AM

PAYYAVULA LAKSHMAIAH no more

 ఖమ్మం, న్యూస్‌లైన్ : భూమి కోసం.. భుక్తి కోసం.. పేద ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ‘యోధుడు’ పయ్యావుల లక్ష్మయ్య(87) అనారోగ్యంతో ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన ఆయన నూనూగు మీసాల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో, తర్వాత సీపీఎంలో పని చేసిన ఆయన గోకినేపల్లి సర్పంచ్, టేకులపల్లి సొసైటీ చైర్మన్‌గా పని చేశారు.  
 
 తెలంగాణ సాయుధ పోరుటో కీలక భూమిక...
 గోకినేపల్లిలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పయ్యావుల లక్ష్మయ్య 15 సంవత్సరాల వయసులోనే గ్రామంలోని అరాచకాలపై ఎదురు తిరిగారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు 16 సంవత్సరాల వయసులో ఉన్న పయ్యావులను బాలఖైదీగా పంపిస్తే శిక్ష తక్కువగా ఉంటుందని భావించి 19 సంవత్సరాల వయసంటూ ధ్రువీకరించి నిజామాబాద్ జైలుకు పంపారు. 18నెలలు జైలు జీవితం గడిపిన ఆయన సహచర మిత్రులను మేదరమెట్ల సీతారామయ్యతో పాటు మరికొందరితో కలిసి కూడగట్టుకుని జైలు కిటికీల ఊచలను కోసి తప్పించుకున్నాడు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధపోరులో పాల్గొన్నారు. జిల్లాలోని గుండాల, ఇల్లెందు అడవుల నుంచి నల్లగొండ జిల్లా ఆలేరు, సూర్యాపేట, కల్వకుర్తి, పాలేరు దళాల్లో ప్రముఖ సాయుధ పోరాట యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, చకిలం శ్రీనివాసరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం,  మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, మాకినేన బసవపున్నయ్య, చంద్ర రాజేశ్వర్‌రావు, భాగం వీరయ్యలు ఆయన ఉత్సాహాన్ని, సాహసాలను మెచ్చి కల్వకుర్తి జోన్ సాయుధ దళం కార్యదర్శిగా నియమించారు.
 
 పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్‌పై దాడిలో కీలక పాత్ర...
 కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్‌పై అప్పట్లో జరిగిన దాడిలో పయ్యావుల కీలక పాత్ర పోషించారు. నలుగురు దళ సభ్యులతో కలిసి పొగాకు వ్యాపారుల వేషంలో పెనుగంచిప్రోలు చేరుకుని పోలీస్‌స్టేషన్ వివరాలు సేకరించారు. ఉదయం పొగాకు విక్రయించి సాయంత్రం ముసుగులు ధరించి వెంట తెచ్చుకున్న తుపాకులతో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశాడు. పోలీసులను బంధించి వారి వద్ద ఉన్న తుపాకులు తీసుకుని వచ్చాడు.  
 
 ప్రజా సేవలో మిగిలిన జీవితం..
 ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమాలు చేసిన పయ్యావుల జనజీవన స్రవంతిలో కలిసిప తర్వాత ప్రజాసేవ చేశారు. పది సంవత్సరాలు  గోకినేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, రెండుసార్లు టేకులపల్లి సొసైటీ బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోను, ఆ తర్వాత సీపీఎంలో పనిచేసి జిల్లాలో పార్టీ బలోపేతానికిృకషిచేశారు. 
 
 రెండుసార్లు గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పయ్యావులకు భార్య అనుసూర్య, కుమారులు నాగేశ్వరరావు, జగన్‌మోహన్‌రావు, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు.  
 
 పలువురి నివాళి
 పయ్యావుల లక్ష్మయ్య మతదేహానికి సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వనం నర్సింగరావు, గ్రానైట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు సాదు రమేష్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, సుబ్బారావు, ఊటికూటి వెంకటయ్య, నర్సింహారెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. 
 
 నేడు గోకినేపల్లిలో 
 అంత్యక్రియలు
 పయ్యావుల లక్ష్మయ్య అంత్యక్రియలను సోమవారం స్వగ్రామమైన గోకినేపల్లిలో నిర్వహించనున్నట్లు ఆయన మిత్రుడు వనం నర్సింగరావు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ప్రజలు సందర్శనార్థం ఉంచి మధ్యాహ్నం అంత్యక్రియులు చేస్తారని వారు పేర్కొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement